నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి మండలం ఖైతాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాల వద్ద కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైతులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో పలు వ్యవసాయ బోర్లకు చెందిన కేబుల్ వైర్లను దొంగలించి పారిపోతుండగా ఇరువురిని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
గతంలో కూడా పలు చోరీలు జరిగాయని, నిందితులను రెంజల్ పీఎస్లో అప్పగిస్తే వారిని వదిలి వేశారని రైతులు ఆరోపించారు. ఏడాదిలో నాలుగు మార్లు చోరీ జరిగితే ఒక్కోసారి 4 వేల రూపాయల ఖర్చు అవుతోందన్నారు. వీరిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చారు.
సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్ఐ పాండే రావు సిబ్బందితో వెళ్లి సదరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామని ఎస్ఐ గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.