Podem Veeraiya | వెంకటాపురం(నూగూరు), మార్చి 24 : రైతు సమస్యలు ఎవరికీ కనిపించవా..? ప్రా ణాలు పోతేనే కనిపిస్తారా..? అని మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు, అటవీ శాఖ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యను గ్రామస్థులు, రైతులు నిలదీశారు. మక్కజొన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని 20 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్ర హం వ్యక్తంచేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటేనే పరామర్శించేందుకు వస్తారా..? అని నిలదీశారు.
సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని చిరుతపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మక్కజొన్న రైతులు మధుకృష్ణ, చంద్రరాన్ కుటుంబాలను పరామర్శించేందుకు వీరయ్య వచ్చారు. మధుకృష్ణ కుటుంబానికి మక్కజొన్న ఆర్గనైజర్ నుంచి రూ.3లక్షల చెక్కును అందించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న గ్రామస్థులు, రైతులు వీరయ్యను నిలదీశారు. రైతుల గోస పట్టని రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. స్పందించిన వీరయ్య ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపడుతామని, రైతులు ఎవరు అధైర్య పడవద్దని సూచించారు.