హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎన్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ఇంధనశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలోని అంగన్వాడీలకు దశలవారీగా సోలార్ విద్యుత్తు సౌకర్యం కల్పించాలి. గ్రేటర్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలో స్థలాల కొరత నేపథ్యంలో ఫ్లైఓవర్ల కింద సబ్స్టేషన్ల ఏర్పాటుకు మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. రాష్ట్ర ఇంధన అవసరాలకు తగినట్టు సింగరేణి కొత్త కోల్‌బ్లాక్‌లు సాధించాలి. కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాక్‌లను సింగరేణి దక్కించుకోవాలి’ అని సూచించారు.
హైదరాబాద్, జులై 18(నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చైర్మన్‌గా 27 మంది సభ్యులతో జంబో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ మేరకు కమిటీ వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను సభ్యులుగా నియమించింది.
ఎల్ నినోపై అవగాహన కల్పించండి: సీఎస్
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, తీసుకోవాల్సిన కార్యాచరణపై కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో సచివాలయం నుంచి శనివారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ప్రసుత్త పరిస్థితులను సమీక్షించేందుకు ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు పర్యటించనున్నారని, 20న నిర్వహించనున్న జిల్లాస్థాయి సమావేశాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు తప్పక హాజరు కావాలని ఆదేశించారు.