కొత్త సంవత్సరం మొదటి రోజే వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వద్ద ఆటోను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో వికారాబాద్ టౌన్ ఎస్సై శ్రీనునాయక్, అతని తండ్రి మాన్యనాయక్ మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో బైక్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో చిన్నారితోపాటు తల్లిదండ్రులు మరో వ్యక్తి దుర్మరణం చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో నలుగురు, ఖమ్మం జిల్లా పాల్వంచలో ఇద్దరు, సంగారెడ్డి జిల్లాలో ఒకరు మరణించగా, ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నిండింది.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 1: మారుమూల పల్లె నుంచి ఎస్సైగా ఉద్యోగం సాధించారు.. ప్రొబేషనరీ పూర్తిచేసుకొని ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఐదు రోజుల కిందటే వివాహం చేసుకొన్నారు.. ఒడిబియ్యం కార్యక్రమం పూర్తిచేసుకొని విధుల్లో చేరేందుకు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు మృత్యురూపంలో ఎదురొచ్చింది. తనతోపాటు తండ్రినీ బలితీసుకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్యతండాకు చెందిన నేనావత్ శ్రీనునాయక్ (32) వికారాబాద్ వన్ టౌన్ ఎస్సైగా గత నెల 13న విధుల్లో చేరారు. తన వివాహం కోసం డిసెంబర్ 23 నుంచి సెలవులో ఉన్నారు. 26న నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం బొక్యాతండాకు చెందిన యువతితో వివాహం జరిగింది. పెండ్లి కార్యక్రమాలు పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వికారాబాద్‌కు పయనమయ్యారు. తన కారులో తల్లి, కుటుంబ సభ్యులు ముందు వెళ్తుండగా.. తండ్రి మాన్యానాయక్ (50)తో కలిసి శ్రీనునాయక్ ఆటోలో బయల్దేరారు. తండ్రి చేయికి గాయం కావడంతో శ్రీనునాయక్ స్వయంగా ఆటోను నడుపుతున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండ లం రాంనగర్ పోలేపల్లి సమీపంలో హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. పళ్లైన వారంలోపే మృతిచెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. తండాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో బైక్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బల్మూర్ మండలం పోలిశెట్టిపల్లితండాకు చెందిన ఉదయ్ (14) అదే గ్రామానికి చెందిన స్నేహితులు మహేశ్ (18), అరుణ్‌తో కలిసి శనివారం బైక్‌పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. వెల్దండ సమీపంలో ఎదురుగా వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని దవాఖానకు తరలిస్తుండగా ఉదయ్, మహేశ్ చనిపోయా రు. తెలకపల్లి మండలం రాకొండ వద్ద ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టిన మరో ఘటనలో రేణమ్మ (46), బాలస్వామి (43) మరణించారు.
మిత్రులను కలిసి వస్తుండగా బైక్ అదుపుతప్పి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్‌కు చెందిన ఎం నగేశ్ (23) మృతిచెందారు. మిత్రుడు గుడ్ల శ్రావణ్‌కుమార్‌తో కలిసి లింగయ్యపల్లెలోని మిత్రులను కలిసేందుకు బైక్‌పై వెళ్లారు. రాత్రి ఇంటికి వస్తున్న క్రమంలో జన్నారంలో బైక్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. నగేశ్ మృతిచెందగా, శ్రావణ్ తీవ్రంగా గాయపడ్డారు. 21 రోజుల కిందనే పెండ్లి చేసుకొన్న నగేశ్ మృతిపై తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇంట్లోకి యాష్ ట్యాంకర్ దూసుకొచ్చిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన శంకర్‌లాల్ పాల్వంచలోని కేటీపీఎస్‌లో యాష్ లోడ్ కోసం ట్యాంకర్‌తో బయల్దేరాడు. మార్గమధ్యంలో మద్యం తాగాడు. పాల్వంచలోని బొల్లోరుగూడెం చేరుకోగానే ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఇంటిముందు ఉన్న శీలం కోటేశ్వరమ్మ (55), వెంకటనర్సమ్మ (52) మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ లారీలోనే ఇరుక్కున్నాడు. అందులో ప్రయాణిస్తున్న హోంగార్డు ముత్తయ్య స్వల్పంగా గాయపడ్డాడు. అంతకుముందు ఇదే లారీ రెండు ఆటోలను సైతం ఢీకొట్టినట్టు తెలిసింది.
జీవనోపాధి కోసం ఏపీ నుంచి వచ్చిన ఓ కుటుంబాన్ని విధి రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన మోతి బాల్‌రాజ్ (28), అతని భార్య శ్రావణి (22), కూతురు అమ్ములు (8 నెలలు)తో కలిసి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఉంటూ బట్టల వ్యాపారం చేస్తున్నాడు. శనివారం ఉదయం బట్టలు అమ్మేందుకు భార్యాబిడ్డతో కలిసి బీదర్ వైపునకు బైక్‌పై వెళ్తున్నాడు. జహీరాబాద్ మండలంలోని దిడిగి గ్రామం వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బాల్‌రాజ్, శ్రావణితోపాటు చిన్నారి ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కారు పల్టీలు కొట్టడంతో వికారాబాద్ జిల్లా పట్లూర్‌కు చెందిన డ్రైవర్ ఫరీద్ (28) కూడా చనిపోయాడు. మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్పల్లి చౌరస్తా వద్ద జరిగిన మరో ప్రమాదంలో వట్పల్లి మండలం కేరూర్‌కు చెందిన పెద్దపట్ల సరస్వతి (50) మృతి చెందింది.