మర్పల్లి, మార్చి 23: రాష్ట్రంలోని వృద్ధులందరికీ సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులా మారి ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటుంటే.. ప్రధాని మోదీ మాత్రం ఉన్న పళంగా ధరలు పెంచి పేదలను భయపెడుతున్నారు. బీజేపీ సర్కారు పుణ్యమా అని పేదలు కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితికి నెట్టబడ్డారు. వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండల కేంద్రంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కనిపించిన ఓ వృద్ధురాలే అందుకు నిదర్శనం. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తన నియోజకవర్గ పరిధిలోని మర్పల్లి మండల కేంద్రంలో గురువారం ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో తిరుగుతున్న ఎమ్మెల్యేకు.. 12వ వార్డులో కనిగురి పాపమ్మ అనే వృద్ధురాలు కట్టెల పొయ్యిమీద వంట చేస్తూ కనిపించింది. ఎమ్మెల్యే ఆమె దగ్గరికెళ్లి ఆప్యాయంగా పలుకరించారు.
‘కట్టెల పొయ్యిమీద వంట చేస్తున్నావు.. గ్యాస్ లేదా? అని అడుగగా.. బీజేపీ పెంచిన ధరలతో గ్యాస్ వాడకం బంద్ చేసిన. సీఎం కేసీఆర్ ఇచ్చిన పింఛన్ పైసలు ఆసరా అయితుంటే.. బీజేపీ పెంచిన ధరలతో వశపడ్తలేదు’ అని వాపోయింది. కేసీఆర్ ప్రధాని అయితే ఇలాంటి బాధలన్నీ పోతాయని అభిప్రాయపడింది. మోదీ గ్యాస్ ధరలు మొదలుకొని పప్పు, ఉప్పు, నూనె, చక్కెర, బియ్యం తదితర నిత్యావసరాల ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలు బతకలేని పరిస్థితికి తీసుకొచ్చారని స్థానికులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. 2014 మేలో రూ.414 ఉన్న వంట గ్యాస్ ధర 9 ఏండ్ల మోదీ పాలనలలో ప్రస్తుతం రూ.1150కి పెరిగింది. మోదీ పుణ్యమా అని పేద ప్రజలకు మళ్లీ కట్టెల పొయ్యిలే దిక్కయ్యాయని ‘మీతో నేను’లో మర్పల్లి గ్రామస్థులు వాపోయారు.