చెన్నై, నవంబర్ 15: ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు సంబంధించి అనేక సమస్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తాను తీసుకెళ్లినట్లు టీవీకే అధ్యక్షుడు విజయ్ శనివారం వెల్లడించారు. ఓటింగ్ హక్కులను హడావుడిగా, ఏకపక్షంగా, విశ్వసనీయత లేని ప్రక్రియపై ఆధారపడే విధంగా చేయవద్దని ఆయన ఈసీకి విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులు వంటి వర్గాలను సామూహికంగా తొలగించే ముప్పు, ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఎపిక్ కార్డును మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేయడంలోని ఇబ్బందులు, 2002/2005 సర్ రికార్డుల నుంచి ఓటరు సమాచారాన్ని సేకరించడం వంటి సమస్యలను ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్లకు విన్నవించినట్లు ఆయన తెలిపారు. అకారణంగా ఏ తమిళ పౌరుడి ఓటును తొలగించేందుకు వీల్లేదని ఆయన ఈసీని కోరారు.