న్యూఢిల్లీ: ఫాస్టాగ్ లేకుండా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు శుభవార్త. టోల్ ప్లాజాల వద్ద విధిస్తున్న రెట్టింపు చార్జీల నిబంధనలను కేంద్రం కొంత సడలించింది. ఇకపై కేవలం 25 శాతం అదనపు రుసుము చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. లేనివారికి టోల్ చార్జీలు రెండింతలు విధిస్తున్నారు. ఈ నిబంధనను కేంద్రం కాస్త సడలించింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు జరిపితే అదనపు రుసుము 25 శాతం ఉంటుందని కేంద్రం పేర్కొన్నది. అలా కాకుండా నగదు రూపంలో చెల్లింపు జరిపితే ఇంతకు ముందు వసూలు చేసినట్టుగానే రెండింతలు రుసుము విధిస్తారు.