కామారెడ్డి(మాచారెడ్డి), నవంబర్ 15 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను వంచించాయని రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే, 56 శాతం ఉన్న బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నదని మండిపడ్డారు. శనివారం కామారెడ్డి జిల్లాకేంద్రంలో నిర్వహించిన బీసీ ఆక్రోశ సభలో ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. విద్య, వైద్యం, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, కులగణన చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిందని విమర్శించారు. కులగణ న మొత్తం తప్పుల తడకగా ఉన్నదని ధ్వజమెత్తారు.
చట్టం ఎలా చేయాలో ప్రభుత్వంలో ఉన్న దద్దమ్మల కు తెలియడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమిళనాడులో బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు ఏవిధంగా అమలు చేస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల ఆదాయం రెట్టింపు చే స్తామని మోదీ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్యంతోపాటు అన్ని రంగాలను ప్రైవేట్‌పరం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఎస్సీలు, బీసీలు కలవకుండా ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు కుట్ర లు పన్నుతున్నాయని ఆరోపించారు. ఎస్సీలతోని బీసీల మీద కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్నదమ్ముల వలే కలిసి మెలిసి ఉండాలని, బీసీల ఓట్లు బీసీలకే వేస్తామని’ ప్రతిజ్ఞ చేయించారు.
తరతరాలుగా బీసీలకు అన్యాయం
బీసీలు తరతరాలుగా మోసపోతున్నారని సినీ దర్శకుడు శంకర్ అన్నారు. కొట్లాడితే తప్ప ఫలాలు అందేలా లేవని పేర్కొన్నారు. దళిత, బహుజనులకు రాజ్యాధికారం కావాలని 25 ఏండ్ల ముందే దేశంలో ఎవరూ తీయని విధంగా జయం మనదేరా.. సిని మా తీసినట్టు గుర్తుచేశారు. బీసీలంతా ఉద్యమిస్తే తప్ప వాటా దక్కదని అన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ మర్కంటి భూమన్న మాట్లాడుతూ… బీసీ లు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. 42 శాతం కోటాకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని, కానీ కేంద్రం మాత్రం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. డాక్టర్ పుట్ట మల్లికార్జున్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని అన్నారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కితేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. బీసీ ఆక్రోశ సభ వైస్ చైర్మన్ విశారదన్ మహరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్‌రాజ్‌గౌడ్, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, సిద్ధిరాములు, విమలక్క, సుమిత్రానంద్, బెల్లపు చంద్రం హాజరయ్యారు.
రాజ్యాధికారంతోనే బీసీలకు మేలు..
రాజ్యాధికారంతోనే బీసీలకు మేలు జరుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. అన్నింట్లోనూ 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాడతామని స్పష్టంచేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ.. బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిందని విమర్శించారు. బీసీలను మభ్యపెట్టడానికే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నోటిఫికేషన్ జారీ చేశారని, రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా బీజేపీ అడ్డుపడుతుందని మండిపడ్డారు. కామారెడ్డి పోరాటాల గడ్డ అని, ఇక్కడి నుంచే బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు.