ఖైరతాబాద్, నవంబర్ 15: ‘దేశంలో భావసారూప్యం కలిగిన బహుజన పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి. రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలి. 2028లో రాజ్యాధికారం దక్కించుకోవాలి’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనమడు, ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భీంరావు యశ్వంత్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42శాతం వాటా, 2028లో తెలంగాణ బహుజన రాజ్యాధికారాన్ని సాధించడం ఎలా’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈవీఎంల వల్ల ఎన్నికల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని, అదే ప్రతి పార్టీ డిమాండ్ కావాలని సూచించారు. అగ్రవర్ణ ఆధిపత్యం ఉన్న పార్టీల వల్ల బహుజనులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ 42శాతం రిజర్వేషన్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుజనులను మోసగిస్తున్నాయని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ రూ.150 కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచాడని, ఈ విషయాన్ని ఆ పార్టీయే స్వయంగా చెప్పుకొంటున్నదని ఆరోపించారు. ఒక్కో ఓ టుకు రూ.3 వేలు, రూ.5వేలు, రూ.10 వేల చొప్పున ఖర్చు పెట్టాడని, ఇక బహుజనులకు ఏం న్యాయం చేస్తాడని, 42శాతం కోసం ఎలా పోరాడుతాడని ప్రశ్నించారు. ఆయన అగ్రవర్ణ ఆధిపత్య పార్టీలో పనిచేస్తూ ఏమి చేయలేడని చెప్పారు. రాష్ట్రంలో 72 శాతం కార్పొరేషన్ చైర్మన్ పదవులను సీఎం రేవంత్‌రెడ్డి తన సామాజికవర్గానికే కట్టబెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. జనవరి 3న సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా సరూర్‌నగర్ స్టేడియంలో వేలాది మంది మహిళలతో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో తెలంగాణ బహుజన కూ టమి అధ్యక్షుడు వీజీఆర్ నారగోని, గౌరవ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్, ఆర్పీఐ ఏపీ ఇన్చార్జి మేజర్ చంద్రకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల ప్రదీప్‌గౌడ్, తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్, ఈద శేషగిరిరావు, దండి వెంకట్, నూనె వెంకటస్వామి, పోతు అశోక్, లాలునాయక్, కోట వెంకన్న పాల్గొన్నారు.