హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన మందుల కొనుగోలులో అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వైద్యశాఖలో పెచ్చుమీరిన అవినీతిపై ఏప్రిల్ 28న ‘నమస్తే తెలంగాణ’లో ‘మందుగోళీ.. వాటాల కేళి!’ అనే కథనాన్ని ప్రచురించింది. మందుగోళీల్లో అక్రమాలు అవాస్తవం అని చెప్పుకొనేందుకు వైద్యశాఖ అధికారులు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొడుతూ పక్కా ఆధారాలతో మే 6న ‘మందుగోళీల్లో అక్రమాలు నిజమే!’ పేరిట మరో కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రచురించిన రెండు రోజులకే సరోజినీదేవి కంటి దవాఖానలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్(సీఎంఎస్)లో అగ్నిప్రమాదం జరుగడం, ఆ ప్రమాదంపై అధికారులు గోప్యత పాటించిన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇక నమస్తే వరుస కథనాలతోపాటు విజిలెన్స్‌కు అందిన ఫిర్యాదుతో మే 20న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈ మొత్తం అవినీతి వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. టెండర్లలో గో ల్మాల్, నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటు న్న టీజీఎంఎస్ఐడీసీ కీలక అధికారి, అతనికి సహకరించిన ఇతర అధికారులపై విచారణకు ఆదేశిస్తున్నట్టు విజిలెన్స్ తన లేఖలో పేర్కొంది.
కలెక్టర్లు విచారణకు సహకరించాలి
విజిలెన్స్ విచారణకు అన్ని ప్రభుత్వ శాఖలు/సెక్రటేరియట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు, ఆయా విభాగాల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు సహకరించాలని లేఖలో కోరింది. విచారణకు అవసరమైన రికార్డులను పరిశీలించడంలో తోడ్పాటు అందించాలని స్పష్టం చేసింది. కీలక అధికారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రొక్యూర్మెం ట్ విధానం, రిటుక్సిమాబ్ ఇంజెక్షన్, టికగ్రిలోర్ ట్యాబ్లెట్, ఇంజెక్షన్ ఇన్సులిన్ 50: 50, 70:30, ఇంజెక్షన్ ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోజ్, డయగ్నాస్టిక్స్, రీఏజెంట్స్, కిట్స్, ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ వివరాలను అందజేయాలని ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..!
వైద్యశాఖలోని టీజీఎంఎస్ఐడీసీ అవసరానికి మించి భారీగా మందులు కొనుగోలు చే యడంతో రూ.150 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిన వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. ఫేక్ ఇండెంట్లు సృష్టించి కోట్లు కొల్లగొట్టారని ఈ మొత్తం వ్యవహారాన్ని టీజీఎంఎస్ఐడీసీ కీలక అధికారి ముందుండి నడిపారని కథనంలో పేర్కొన్నది. కాలంచెల్లిన మందులు భారీగా పేరుకుపోవడంతో డిస్పోజల్‌కు ఓ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్టు వెలుగులోకి తెచ్చింది.
బీఆర్ఎస్పై దుష్ప్రచారానికి చెక్!
‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమవగానే హుటాహుటిన ఓ రిపోర్టును తయారు చేసిన వైద్యారోగ్య శాఖ అధికారులు బీఆర్ఎస్ హయాంలోనే మందులు కాలం చెల్లాయని బుకాయించారు. 2024-25లో కేవలం రూ.9 లక్షల మందులు మాత్రమే కాలం చెల్లాయనేది ఆ రిపోర్టు సారాంశం. ఆ రిపోర్టును సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఇదే వాస్తవం అంటూ అబద్ధాలకు తెర లేపారు. ఇక ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో ఆధారాలతో మరో కథనం ప్రచురితమవడంతో వారంతా సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ సర్కార్‌పై నెపం నెట్టి తప్పించుకోవాలని చూసిన వాళ్లంతా మందుగోళీల్లో అక్రమాలపై విజిలెన్స్ విచారణ అంశంపై ఏం సమాధానం చెబుతారో తేలాల్సి ఉన్నది.