హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులలో పారదర్శకతను పెంచడానికి, రైతు సంక్షేమాన్ని కాపాడటానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఈనెల 16 నుంచి 18 వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), లీగల్ మెట్రాలజీ, మారెటింగ్ శాఖల సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నారాయణపేట వంటి జిల్లాల్లో 65కు పైగా జిన్నింగ్ మిల్లులు, పత్తి కొనుగోలు కేంద్రాలను అధికారులు తనిఖీ చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా వేబ్రిడ్జి ధృవీకరణ పత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, సీసీటీవీలు (15 నుంచి 120 రోజుల బ్యాకప్), అగ్నిమాపక భద్రత లైసెన్స్‌లు, కిసాన్ కపాస్ యాప్ అమలు తీరును పరిశీలించామని వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోతూరు, నల్లగొండ జిల్లా చింతపల్లిలో నాణ్యత లేని, సీలు లేని వేబ్రిడ్జిలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. సంగారెడ్డిలో తూకాల్లో అక్రమాలు, రంగారెడ్డిలో వేబ్రిడ్జి వ్యత్యాసాలకు బాధ్యులపై రూ.85,000 జరిమానా విధించామని స్పష్టంచేశారు. వరంగల్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని మిల్లుల నుంచి సేకరించిన నమూనాలను సాంకేతిక ధృవీకరణ కోసం ప్రయోగశాలలకు పంపామని, చాలాచోట్ల సీసీటీవీలు ఉన్నా తగినంత డాటా బ్యాకప్ లేదని తేలినట్టు చెప్పారు.