హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రచయిత్రి, విదుషీమణి డాక్టర్ విజయభారతి అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబీకులు శుక్రవారం ఉదయం సనత్‌నగర్‌లోని రెనోవా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విజయభారతి తండ్రి ప్రముఖ కవి, రచయిత బోయి భీమన్న. కాగా ఆమె న్యాయవాది, దివంతగత మానవ హకుల నేత బొజ్జా తారకంకు భార్య. విజయభారతి కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం సాగునీటి పారుదలశాఖ కారదర్శిగా ఉన్నారు. విజయభారతి కోరికమేరకు ఆమె భౌతికదేహాన్ని కుటుంబసభ్యులు ఆదివారం గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు విజయభారతి మృతి పట్ల సంతాపం తెలిపారు.
దళిత చైతన్య స్ఫూర్తి..
విజయభారతి రచయిత్రిగా, అనువాదకురాలిగా, తెలుగు సాహిత్య అకాడమీ డైరెక్టర్‌గా సామాజిక, సాహిత్యరంగాలకు ఎనలేని కృషి చేశారు. అంబేదర్ , జ్యోతిబా ఫూలేను అధ్యయనం చేశారు. ఆ ప్రభావంతోనే భారతీయ కుల వ్యవస్థ, స్వరూప స్వభావాల గురించి పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా విశ్లేషణలు చేస్తూ అనేక రచనలు చేశారు. నరమేథాలు నియోగాలు.. పురాణాలు మరోచూపు వాటిలో ప్రసిద్ధమైనవి. అంబేద్కర్, ఫూలే జీవిత చరిత్రలను మొట్టమొదటిసారిగా తెలుగు సమాజానికి అందించిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. వాటన్నింటినీ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆమెను పలు సాహిత్య అవార్డులు స్వీకరించారు. డాక్టర్ విజయభారతి 2013-2015 మధ్య సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అధ్యక్షురాలిగా కొనసాగారు. దళితుల హక్కుల కోసం కీలకంగా పనిచేశారు. పురణాల్లో దళిత స్త్రీల పాత్రలపై కూడా అనేక రచనలు చేశారు. ఇటీవలనే ఆమె రాసిన వ్యాస సంకలనం ‘75ఏళ్ల స్వతంత్ర భారతం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా’ అనే శీర్షికతో వెలువడింది. ఆత్మకథను కూడా రాసి ప్రచురణకు సిద్ధం చేసి ఉంచారు.
ప్రముఖులు, సాహితీవేత్తల సంతాపం..
డాక్టర్ విజయభారతి మృతిపై ప్రముఖులు, సాహితీవేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక రంగాలకు ఆమె చేసిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు. విదుషీమణి, మానవీయ కవయిత్రి, తెలుగునాట దళితచైతన్య జ్యోతికి చమురుపోసి వెలిగించారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. అంబేద్కరిస్టు, పరిశోధకురాలు విజయభారతి మృతి సాహిత్యానికి తీరని లోటని, దళిత దృక్పథంలో నుంచి ప్రాచీన సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేస్తూ విజయభారతి రాసిన విలువైన గ్రంథాలు అస్తిత్వ ఉద్యమాలకు కొత్త చూపును అందించాయని ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు శ్లాఘించారు. డాక్టర్ విజయభారతి సమాజసేవ, చేసిన కృషి, త్యాగం, రచనలు, తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కృష్ణ కొనియాడారు. విజయభారతి మరణం సాహిత్యరంగానికి తీరనిలోటని తెలంగాణ సాహిత్య పరిషత్ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. ఆమె రచనలు అస్తిత్వ పోరాటానికి దిక్సూచిలా నిలిచాయని పేర్కొన్నారు.
విజయభారతి మృతికి కేసీఆర్ నివాళి
డాక్టర్ విజయభారతి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సాహిత్య, సామాజిక అధ్యయనశీలిగా విశ్లేషకులుగా డాక్టర్ విజయభారతి చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా సేవలందించిన విజయభారతి, డాక్టర్ బీఆర్ అంబేదర్ రచనలు, ప్రసంగాల సంపుటాలకు సంపాదకురాలుగా, మహాత్మా జోతిరావు పూలే జీవిత చరిత్రను తెలుగు సమాజానికి మొట్టమొదటిసారి అందించిన రచయిత్రిగా ఆమె కృషి అమోఘమని ఆయన కొనియాడారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.