యాదగిరిగుట్ట, మే 24 : యాదగిరిగుట్ట ఆలయం లోపలికి ఫోన్ తీసుకెళ్లడం నిషిద్ధం. కానీ శనివారం సీఎం పర్యటన సందర్భంగా ఆలయం లోపల ఏకంగా వీడియో తీశారు. గర్భాలయం, స్వయం భూ లక్ష్మీనరసింహస్వామి స్పష్టంగా కనిపిస్తున్న వీడియో సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో ఆదివారం అప్లోడ్ చేశారు. ‘వేద మంత్రోచ్ఛారణల మధ్య.. వేద పాఠశాల నిర్మాణానికి శ్రీకారం’ అంటూ 2.55 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో సీఎం ఆలయంలో ప్రవేశించడం, పూర్ణకుంభ స్వాగతం, గర్భాలయం, స్వామివారి దర్శనం తదితరాలు ఉన్నా యి.
ఆగమశాస్త్ర ప్రకారం మూలవిరాట్టు ఉన్న ప్రదేశాలను ఫొటో, వీడియోలు తీయడం నిషిద్ధం. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీతో వచ్చే కాంతి, పరికరాల శబ్దాలు ఆ ప్రశాంతతకు భంగం కలిగిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. అం దుకే దేవస్థాన అధికారులు ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. కానీ సీఎం ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వీడియోలో మూలవిరాట్టు సైతం కనిపించడం గమనార్హం. రాష్ర్టాన్ని సక్రమమార్గంలో నడిపించాల్సిన ముఖ్యమంత్రే ఆలయ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆ వీడియోను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.