న్యాల్కల్, సెప్టెంబర్ 2: జీవనాధారమైన పచ్చని పంటపొలాలను తీసుకుని.. తీవ్రమైన నష్టం చేకూర్చే ఫార్మాసిటీ ఏర్పాటుకు తమ ప్రాణాలు పోయినా సరే భూములను ఇచ్చేది లేదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాల ప్రజలు తేల్చిచెప్పారు. ఆయా గ్రామాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు సేకరించే భూములను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన జిల్లా ట్రైనీ కలెక్టర్ మనోజ్, జిల్లా రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ మాధురి, జహీరాబాద్ ఆర్డీవో రాజును డప్పూర్-మల్గి గ్రామాల శివారులో స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, భూబాధితులు మాట్లాడుతూ.. తమ గ్రామాల పరిధిలో 2 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గుట్టుచప్పుడు కాకుండా అధికారులు సర్వే చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
సాగు భూములు తీసుకొని తమను రోడ్డు పాలు చేయొద్దని, ఫార్మాసిటీ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు నాలుగు గంటల వరకు అధికారులను కదలనివ్వకుండా వాహనాలకు అడ్డుగా నిలిచారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి అధికారులెవరూ వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి పోలీస్ సిబ్బందితో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. అనంతరం జిల్లా రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ మాధురి, జహీరాబాద్ ఆర్డీవో రాజుకు భూబాధితులు వినతిపత్రాన్ని అందజేశారు. ఇకపై అధికారులెవరైనా తమ గ్రామాలకు వచ్చేముందు సమాచారం ఇవ్వాలని, గుట్టుచప్పుడు కాకుండా వస్తే సహించేదిలేదని స్పష్టంచేశారు.
పచ్చని పొలాలపై ‘ఫార్మా’ పాగా తగదు
ఇప్పటికే న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో నిమ్జ్ ఏర్పాటుకు ఈ ప్రాంత రైతుల నుంచి 12,635 ఎకరాల భూమి సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 3,600 ఎకరాలు సేకరించారు. ఇప్పుడు ఫార్మాసిటీ కోసం న్యాల్కల్ మండలంలోని డప్పూర్, మల్గి, వడ్డి గ్రామాల్లో 2,003 ఎకరాల భూసేకరణ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగానూ న్యాల్కల్ మండలం డప్పూర్ గ్రామ శివారులో 1465.25 ఎకరాలు, మల్గిలో 282.13 ఎకరాలు, వడ్డిలో 256 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములను సర్వే చేసిన సంబంధిత జిల్లా అధికారులు.. ప్రభుత్వానికి నివేదికలను పంపించారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో భూసేకరణ చేపట్టేందుకు సంబంధిత జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై గెజిట్ నోటిఫికేషన్ జీవో పత్రాలను అతికించారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఆయా గ్రామాల శివారులోని గుట్టలపై నవనాథ్ సిద్ధలింగేశ్వరస్వామి, మల్లన్నస్వామి, ఫీర్గైబ్ సాహెబ్ దర్గాలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సైతం ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. భూములు కోల్పోవడంతో తాము రోడ్డున పడటంతోపాటు అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని వాపోతున్నారు.
హద్నూర్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు
ఫార్మాసిటీ (విలేజ్) కోసం చేపట్టే భూసేకరణకు అధికారులు ముందుస్తు సమాచారం లేకుండా గ్రామాల్లోకి రావొద్దంటూ వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన నాయకులు, భూబాధితులు సోమవారం రాత్రి హద్నూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్సై రామానాయుడుకు ఫిర్యాదు చేశారు. ఫార్మాసిటీ కోసం బలవంత భూసేకరణ తగదని, ముందస్తు సమాచారం లేకుండా గ్రామాలకు వచ్చే సమయంలో జరిగే పరిణామాలకు తమను బాధ్యులు చేయొద్దని చెప్పారు. ముందుగా సమాచారం ఇస్తే అధికారులకు సహకరిస్తామని తెలిపారు.