భూపాలపల్లి రూరల్, ఆగస్టు 2: కాంగ్రెస్ నాయకుడు తన భూమిని ఆక్రమిస్తున్నాడంటూ మరో బాధితురాలు శనివారం జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగింది. సెక్యూరిటీ సిబ్బంది మందు డబ్బా లాక్కొని పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. బాధితురాలు చావన్ సుశీల మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం..
భూపాలపల్లిలోని హనుమాన్‌నగర్‌కు చెందిన సుశీల మండలంలోని మోరంచపల్లి శివారులో గల 369/బీ సర్వే నంబర్లోని 4 ఎకరాల భూమిని 1986లో చాడ నర్సింహారెడ్డి వద్ద కొనుగోలు చేసింది. ఆ తరువాత రెండెకరాలను సమ్మయ్యకు అమ్మింది. 2015లో కొడుకు చనిపోవడంతో 2016 నుంచి ఆ రెండెకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నది. 2020లో వల్లంకుంటకు చెందిన సోమ ప్రభాకర్ ఈ భూమి తనదని, తాను కొ న్నాంటూ రావడంతో సుశీల గొడవ చేయడంతో వెళ్లిపోయాడు.
15 రోజుల క్రితం వరినారు పోయగా, ఈ భూమి తనదంటూ మోరంచపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చుక్క రమేశ్ వచ్చి వరి నారు నాశనం చేశాడు. వల్లంకుంటకు చెందిన సోమ ప్రభాకర్ వద్ద ఈ భూమిని కొన్నానని రావడంతో న్యాయం కోసం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డికి ఫోన్ చేసి సుశీలకు న్యాయం చేయాలని చెప్పారు.
శనివారం సుశీల ట్రాక్టర్ తీసుకొని పొలం దున్నించడానికి వెళ్లగా.. రమేశ్ అడ్డుపడుతూ బూతులు తిట్టాడు. ఈ భూమిపై తనకే హక్కు ఉన్నట్టు ఎమ్మెల్యే చెప్పారని గొడవకు దిగాడు. దీంతో సుశీల పురుగుమందు డబ్బాతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లింది. అక్కడున్న పోలీసులు మందు డబ్బాను లాక్కున్నారు. పేదలకు న్యాయం చేయకుండా ఎమ్మెల్యే కాంగ్రెస్ వారికి అండగా ఉండటం న్యాయం కాదని, వెంటనే విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటున్నది.