హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న బాధితులు ప్రభుత్వం పై సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేండ్లుగా వేధింపులకు గురవుతు న్న వివిధ వర్గాలవారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills By Election) కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ సంఖ్యలో నామిషనేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ట్రిపుల్ఆర్, నిరుద్యోగ జేఏసీ, మాల సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ, ఎలివేటెడ్, నార్త్‌సిటీ మెట్రో బాధితులు కదం తొక్కుతున్నారు. ఉపఎన్నిక ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. నామినేషన్లతోపాటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. మాట నిలుపుకోలేదు. రెండేండ్లు గడుస్తున్నా బీఆర్ఎస్ భర్తీ చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. దీంతో రెండేండ్లుగా కోచింగ్ సెంటర్లలో రూ.లక్షలు వెచ్చిస్తూ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాంగ్రెస్ చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిరుద్యోగులు, యువత నిర్ణయించుకున్నారు. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఉప ఎన్నికల్లో వందలాదిగా నామినేషన్లు వేసి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగ విరమణ పొందిన తాజా రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ వారికి నమ్మకం ద్రోహం చేసింది. దీంతో కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు జూబ్లీహిల్స్‌లో నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలకు వ్యతిరేకంగా ఉప ఎన్నికకు నామినేషన్ వేస్తామని చెప్తున్నారు. ఉద్యోగ విరమణ పొంది శేష జీవితాన్ని సంతోషంగా గడపాల్సిన తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నిత్యం మూడు లక్షల మంది రాకపోకలు సాగించే నార్త్‌సిటీకి మెట్రోరైలును విస్తరించడంలో కాంగ్రెస్ ప్రభత్వుం తీవ్ర జాప్యం చేస్తున్నది. ఆ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్‌జామ్‌తో అటువైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్యారడైస్ నుంచి మేడ్చల్ వరకు మెట్రోరైలును అందుబాటులోకి తీసుకొనిరావడంలో తాత్సారంపై ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అనుమతులు, పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడుతున్నారు. ఏడాదిగా భూసేకరణ పూర్తి చేయకుండా మొద్దు నిద్ర వహిస్తుండటంతో కాంగ్రెస్ బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమ ప్రాంతానికి కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని జూబ్లీహిల్స్ ప్రజల ముందుంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ సర్కారుపై మాల సంఘాలు జంగ్‌సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నాయి. రిజర్వేషన్ల పునర్విభజనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఇష్టారీతిన షెడ్యూల్డ్ కులాల ఉప కులాలకు రిజర్వేషన్లను వర్గీకరించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్లు వేస్తామని అన్ని మాల సంఘాలు మూకుమ్మడిగా ప్రకటించాయి. కాంగ్రెస్ మోసాలకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తామని చెప్తున్నారు.
రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను అక్రమంగా లాక్కుంటున్నది. కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులు, సన్నిహితుల భూములను రక్షించేందుకు పేద రైతుల భూములను పణంగా పెడుతున్నది. దీనిపై కన్నెర్ర చేసిన అన్నదాతలు కొద్దిరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. తమకు జరుగుతున్న అన్యాయంపై నిరసనలు తీవ్రతరం చేశారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వందలాదిగా నామినేషన్లను వేసేందుకు సిద్ధమవుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తున్నారు.
అలైన్మెంట్ మార్పుపై రైతుల కన్నెర్ర రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను అక్రమంగా లాక్కుంటున్నది. కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులు, సన్నిహితుల భూములను రక్షించేందుకు పేద రైతుల భూములను పణంగా పెడుతున్నది. దీనిపై కన్నెర్ర చేసిన అన్నదాతలు కొద్దిరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. తమకు జరుగుతున్న అన్యాయంపై నిరసనలు తీవ్రతరం చేశారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వందలాదిగా నామినేషన్లను వేసేందుకు సిద్ధమవుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తున్నారు.