Zero FIR | హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం గతంలో బాధితులెవరైనా సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తే.. ‘మీ ప్రాంతం మా పరిధిలో లేదు. అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయండి’ అనే సమాధానం వినిపించేది. దీంతో బాధితులు తమ నివాసం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, ఫిర్యాదు చేసేలోపు ఎన్నో అనర్థాలు జరిగేవి. ఇలాంటి సమస్యలకు చెక్‌పెట్టి జవాబుదారీతనంతో ప్రజలకు మెరుగైన రక్షణ, భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ల మధ్య ఉన్న హద్దులను పూర్తిగా చెరిపేసింది.
అత్యవసర పరిస్థితుల్లో తీవ్రమైన కేసులను నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టేందుకు ఎప్పటి నుంచో రాష్ట్రవ్యాప్తంగా ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానాన్ని అమలు చేస్తున్నది. దీంతో ఏటా ‘జీరో ఎఫ్ఐఆర్’ కేసుల సంఖ్య పెరుగున్నది. పరిధులతో సంబంధం లేకుండా కేసు తీవ్రతను బట్టి రాష్ట్రంలో ఎక్కడైనా కేసు నమోదు చేసేలా ప్రభుత్వం విస్పష్ట ఆదేశాలివ్వడంతో తీవ్రమైన నేరాలకు సంబంధించి పోలీసులు తప్పనిసరిగా జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2021లో 838, 2022లో 938 కేసులు జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదయ్యాయి. ఏడాది వ్యవధిలోనే ఈ కేసుల నమోదు 12% పెరిగినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా బాధితులు సాయం కోసం తమకు సమీపంలో ఉండే ఏ పోలీస్ స్టేషన్‌కైనా వెళ్లొచ్చు. అకడి పోలీసులు ఫిర్యాదు స్వీకరించి బాధితులకు తక్షణ సాయం అందజేయడంతోపాటు సంబంధిత స్టేషన్‌కు సమాచారం అందజేయాలి. సాధారణంగా పోలీస్ స్టేషన్లలో ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ వరుస నంబర్లతో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుంటారు. కానీ, జీరో ఎఫ్ఐఆర్లో నంబర్ ఇవ్వకుండానే కేసు నమోదు చేస్తారు. తర్వాత దాన్ని సంబంధిత స్టేషన్‌కి బదిలీ చేశాక ఆ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ నంబరు ఇస్తారు. ముందుగా జీరో నంబర్‌తో కేసు నమోదు చేస్తారు కాబట్టి దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు.
అంతమాత్రాన జీరో ఎఫ్ఐఆర్ విలువ ఏ మాత్రం తగ్గదు. చట్టపరమైన ప్రక్రియ అంతా మామూలుగానే సాగుతుంది. 2013 నవంబరులో సుప్రీంకోర్టు లలిత కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసులకు ఇచ్చే శిక్షణలో కూడా జీరో ఎఫ్ఐఆర్ అంశాన్ని చేర్చాలని కేంద్ర హోంశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. అంతేకాకుండా ఈ అంశంపై 2015 అక్టోబర్ 12న అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకూ ఓ లేఖ కూడా రాసింది. దీంతో ఏ పోలీసు అధికారి అయినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరిస్తే ఐపీసీలోని 166-ఏ సెక్షన్ కింద అతనికి ఏడాది శిక్ష, జరిమానా విధించవచ్చు.