Assembly Elections : కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) షెడ్యూల్ ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొన్నది. గెలుపు గుర్రాల ఎంపికలో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల తొలి జాబితాలను ప్రకటించాయి.
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి తన అభ్యర్థులుగా సీనియర్ రాజకీయ నేత పీసీ జార్జ్, ఆయన తనయుడు శోన్ జార్జ్లను బరిలోకి దించింది. బీజేపీ సోమవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ప్రకారం.. క్రైస్తవులు గణనీయంగా ఉన్న పూంజర్, పాలా నియోజకవర్గాల్లో జార్జ్, శోన్లు పొటీ చేస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ జాతీయ మండలి సభ్యుడిగా పీసీ జార్జ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శోన్ పని చేస్తున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జార్జ్ మూడు దశాబ్దాలకుపైగా శాసనసభ సభ్యుడిగా ఉన్నారు.