హైదరాబాద్/సుల్తాన్‌బజార్,అక్టోబర్ 2: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి పది నెలలు గడిచినా.. పట్టించుకోవడం లేదంటూ బాధితులు బుధవారం గాంధీభవన్‌ను ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ సందర్భంగా 317 బాధితులు మాట్లాడుతూ.. స్థానికత మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో స్థానికులకు అన్యాయం చేస్తారా..? అని ప్రశ్నించారు. ‘నా కంటే ముందు ఉద్యోగం పొందిన వారు స్థానికులు, నా తరువాత డీఎస్సీ-2024 ఉద్యోగం పొందబోయే వారూ స్థానికులే మరి నా స్థానికత ఎక్కడ సీఎం’ అని ఓ 317 బాధితుడు బ్యానర్‌ను ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. గాంధీ జయంతి రోజున గాంధీ సాక్షిగా జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని బాధితులు కోరారు.