వరంగల్ చౌరస్తా: వరంగల్ ఎంజీఎం దవాఖానలో (MGM Hospital) మృతదేహాలు మారిన ఘటనలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బతికే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సమయంలో పోలీసులకు ఔట్ పోస్ట్ పోలీసులు తప్పుగా సమాచారం అందించడం అసలు కారణంగా గుర్తించారు. జూలై 9న రైలు పట్టాలపై గాయాలతో పడివున్న వ్యక్తిని వరంగల్ రైల్వే పోలీసులు 108 అంబులెన్సులో ఎంజీఎం దవాఖానకు తరలించారు. అదే సమయంలో తొర్రూరు నుంచి మరో వ్యక్తిని స్పృహ కోల్పోయిన స్థితిలో హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. అయితే రైల్వే పోలీసులు తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులకు అందించాల్సిన సమాచారాన్ని ఔట్ పోస్ట్ పోలీసులు కుమారస్వామిగా భావించి తొర్రూరు పోలీసులకు సమాచారం అందించడంతో సమస్య ఉత్పన్నమైంది.
తొర్రూరు పోలీసులు 10వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో గోక కుమారస్వామి భార్య రమకు తన భర్త మృతి చెందినట్లు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రమ, కుటుంబ సభ్యులకు ఎంజీఎం హాస్పిటల్ మార్చురీకి వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో మార్చురీ చేరుకున్న కుమారస్వామి భార్య రమ.. శవాన్ని పరిశీలించి చాలాకాలంగా తనతో నివసించకపోవడం కారణంగా పోల్చుకోలేక పోతున్నాను అని చెప్పడంతో పోలీసులు కుమారస్వామి బావమరిది చూపించారు. అతను సైతం పోల్చుకోలేక పోయినప్పటికీ పోలీసులు మృతదేహం కుమారస్వామిదేనని తీసుకువెళ్లాలని ఆదేశించడంతో అంబులెన్స్‌లో గ్రామానికి తరలించారు. అంత్యక్రియల సమయంలో మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టును చూసిన కూతురు, కుమారస్వామి తోబుట్టువులు.. మృతదేహం కుమారస్వామి కాదని గొడవకు దిగారు. పోలీసులకు సమాచారం అందించి, మృతదేహాన్ని తిరిగి ఎంజీఎం మార్చురీకి తరలించామని వెల్లడించారు. తొర్రూరు నుంచి 108 వాహనంలో తీసుకువచ్చిన కుమారస్వామి మాత్రం ప్రస్తుతం ఐడీ వార్డులో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి కుమారస్వామి యేనని కుటుంబసభ్యులు ధృవీకరించ వలసి ఉంది.
రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన రమకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె కు చెందిన గోక కుమారస్వామి(55)తో 35 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె ఉన్నది. జీవనోపాధి కోసం కొంతకాలం వీరు సూరత్‌కు వెళ్లగా కుమారస్వామి మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. కుమారస్వామి తొర్రూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న క్రమంలో ఈ నెల 9న వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి సమీపంలో గాయపడగా పోలీసులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు.