హిమాయత్‌నగర్, ఫిబ్రవరి 1 : తన ఇంటి స్థలాన్ని ఆక్రమించున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి జగద్గిరిగుట్ట పోలీసులు భూకబ్జాదారులకు వత్తాసు పలుకడాన్ని నిరసిస్తూ మెడలో చెప్పుల దండ వేసుకుని ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో 2000 సంవత్సరంలో నాగయ్య వద్ద నుంచి 1,700 గజాల ఇంటి స్థలాన్ని చంద్రరుక్మిణితో కలిసి కొనుగోలు చేశానని తెలిపారు. ఈ స్థలంలో తాను నివాసం ఉండటంతోపాటు రాజీవ్‌గాంధీ అనాథ శరణాలయం నిర్వహించినట్టు చెప్పారు.
తమ ఇంటి స్థలంపై కన్నేసిన భూకబ్జాదారులు మహేశ్వర్‌రెడ్డి, రాజ్యలక్ష్మి, వెంకటేశ్‌తోపాటు మరి కొంతమంది తనపై దాడి చేసి ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారని వాపోయారు. తాను హైకోర్టును ఆశ్రయించగా తన ఇంటి స్థలానికి రక్షణ కల్పించాలని జగద్గిరిగుట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. కానీ పోలీసులు భూ కబ్జాదారులకు సహకరిస్తూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి భూకబ్జాదారులు, జగద్గిరిగుట్ట పోలీసులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో ప్రతినిధులు చంద్రకళ, రుక్మిణి, స్వాతి, పోచం తదితరులు పాల్గొన్నారు.