ఎర్రుపాలెం, మార్చి 23 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఓ కామాంధుడి నిర్వాకం వల్ల గర్భం దాల్చిన బాలిక (17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించేందుకు ఎస్సై నిరాకరించడమే ఇందుకు కారణం. బాధితురాలి కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. భీమవరం హరిజనవాడకు చెందిన ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన 27 ఏండ్ల యువకుడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఆ యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు ఐదు రోజుల క్రితం ఆ బాలిక తన కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. కానీ ఫిర్యాదును స్వీకరించేందుకు ఎస్సై వెంకటేశ్ నిరాకరించడంతో బాధితురాలి కుటుంబసభ్యులు శనివారం ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లి పోలీసు కమిషనర్‌ను కలిశారు. తమ ఫిర్యాదును ఎస్సై తీసుకోవడంలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ ఆదివారం వెళ్లి ఫిర్యాదు చేయబోయినా ఎస్సై తీసుకోకపోవడంతో రహదారిపై రాస్తారోకో చేయడంతోపాటు ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. నిందితుడిని కాపాడేందుకు ఓ మాజీ ప్రజాప్రతినిధి, పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మనస్తాపం చెందిన బాలిక.. వాటర్ ట్యాంకుపైకి ఎక్కి దూకబోయింది. బాలిక సోదరుడు, పోలీస్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. కేసు నమోదు చేస్తానని ఎస్సై హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.