వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 25: ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ‘మామునూర్ వెటర్నరీ పాలిటెక్నిక్ అవుట్.. సీట్ల భర్తీకి రాం..రాం’ అనే శీర్షికతో వచ్చిన వార్తకు హైదరాబాద్‌లోని పీవీ నర్సింహరావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) జ్ఞానప్రకాశ్ స్పందించారు. వరంగల్ జిల్లా మామునూర్ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలోని 22 సీట్లకు రెండేండ్లుగా కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందారని, సీట్ల భర్తీ 50 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.
2025-26 విద్యాసంవత్సరానికి 99 సీట్లు కేటాయించగా కేవలం 55 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దీంతో జూలై 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు వీసీ జ్ఞానప్రకాశ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఉదయ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.