హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ఉమ్మడిగా వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. శుక్రవారం ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బహిషృత ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్ (తీన్మార్ మల్లన్న) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఇద్దరు నేతలు పిటిషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలను విడుదల చేశారని, కేటీఆర్, జగదీశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చింతపండు నవీన్‌కుమార్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. పిటిషనర్ల తరఫున న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కక్షసాధింపుతో కేసు పెట్టారని చెప్పారు. పిటిషనర్లు వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ఆరోపణలకు ఆధారాలు చూపలేదని, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరారు.