నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పు ఈ నెల 28న వెలువడనుంది. ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా నాగార్జున తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు, టీవీ చానళ్లు సహా సామాజిక మాధ్యమాల్లో వచ్చాయని, దీంతో నాగార్జున కుటుంబం పేరు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని చెప్పారు. మంత్రి సురేఖ తరఫున సీనియర్ న్యాయవాది మస్తాన్‌నాయుడు వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం మేజిస్ట్రేట్ శ్రీదేవి తీర్పును రిజర్వు చేస్తూ కేసు వాయిదా వేశారు.
కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో కోర్టు ఇప్పటికే సురేఖకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది. సోషల్ మీడియా, టీవీల్లో, పత్రికల్లో ప్రసారమైన వార్తలను తొలగించాలని, మరోసారి వార్తను ప్రసారం చేయకూడదని కోర్టు ఆదేశించింది. కేసు నమోదు సమయంలో కోర్టుకు రూ. కోటి ఫీజును కేటీఆర్ చెల్లించారు.