Assigned Lands | ఇబ్రహీంపట్నం, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): సర్కారు భూమిలో ఓ నిరుపేద గుడిసె వేసుకుంటే అధికార యంత్రాం గం రాత్రికి రాత్రి బుల్డోజర్లతో వాటన్నింటినీ నేలమట్టం చేస్తుంది. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వమంటే.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే నోటీసులు ఏంది? అంటూ కనీసం గుడిసెలోని సామాను తీసుకునే సమయం కూడా ఇవ్వరు. కానీ రంగారెడ్డి జిల్లాలో రెండు మండలాల సరిహద్దున వంద ఎకరాలకు పైగా అసైన్డ్, సీలింగ్ భూములను కొందరు చెరపట్టారు. బహిరంగంగానే వంద ఫీట్ల రహదారులు, ఇతరత్రా నిర్మాణాలు చేపడుతున్నారు. నెల రోజులుగా భారీ వెంచర్ పనులు దర్జాగా జరుగుతున్నా… రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం ‘నోటీసులు ఇచ్చాం కదా!’ అంటున్నారు. ఇదంతా రచ్చ జరుగుతుండటంతో సదరు వ్యక్తులకు రెవెన్యూ అధికారులే అధికారిక కబ్జాకు కొత్త మార్గాన్ని చూపుతున్నారు. రైతుల నుంచి పీవోటీ కింద భూములు సేకరించి… ఆ వ్యక్తులు ప్రభుత్వపరంగా కొనుగోలు చేసేందుకూ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉన్నారనే ప్రచారం స్థానికంగా ఊపందుకుంది. మరి..పేదలకో న్యాయం? పెద్దోళ్లకు మరో న్యాయమా? అని సామాన్యుడు ప్రశ్నిస్తున్న ఈ కబ్జా బాగోతంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
గుట్టలను కరిగించి…
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్-ఇబ్రహీంపట్నం మండలాల సరిహద్దున ఓ భారీ వెంచర్ రూపుదిద్దుకుంటుంది. వంద ఫీట్ల రహదారుల నిర్మాణమే కాకుండా పెద్ద పెద్ద గుట్టలను పిండి చేసి, చదును చేసేందుకు భారీ ఎత్తున యంత్రాలు కూడా మోహరించారు. సుమారు నెల రోజులకు పైగా అక్కడ పెద్ద ఎత్తున పనులు కొనసాగుతున్నాయి. తీరా.. ఆ భూములు ఏ పరిధిలోకి వస్తాయని ఆరా తీస్తే విస్మయకర అంశాలు వెలుగు చూశాయి. ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వేనంబరు 189… అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 281 పరిధిలోనే ఈ వెంచర్ తయారవుతుంది. ఇందులో నాగన్‌పల్లి పరిధిలోని భూములన్నీ ప్రభుత్వంతో పాటు పలువురు రైతులకు లావూనీ పట్టాల కింద పంపిణీ చేసినవిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఇక.. అనాజ్‌పూర్ గ్రామ పరిధిలోని భూముల్లో కొంతమేర పట్టా భూమి కాగా.. మిగిలినదంతా సీలింగ్ పట్టా. అయినప్పటికీ అన్నింటినీ కలిపి దాదాపు 300 ఎకరాల్లో భారీ వెంచర్‌కు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం నెల రోజులకు పైగా అక్కడ పెద్ద పెద్ద యంత్రాలతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
40-50 ఎకరాల్లో రోడ్డు, ఇతర నిర్మాణాలు…
ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వేనంబరు 189లో 179 ఎకరాల భూమి ఉంది. గ్రామానికి చెందిన పలువురు నిరుపేద రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు భూమిని పంపిణీ చేసి లావణి పట్టాలు ఇచ్చారు. సదరు రియల్టర్లు చేస్తున్న వెంచర్‌కు వెళ్లాలంటే ఈ భూముల మీదుగానే వెళ్లాలి. దీంతో వెంచర్‌కు సంబంధించిన వ్యక్తులు రైతులతో రహస్యంగా ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. 99 సంవత్సరాల ప్రాతిపదికన లీజు ఒప్పందం చేసుకొని వారికి కొన్ని లక్షలు ముట్టజెప్పారు. ఇలా 40-50 ఎకరాల మేర లావణి పట్టా భూముల్ని ఒప్పందం చేసుకొని అందులో వంద ఫీట్ల రహదారుల నిర్మాణం చేపట్టారు. దీంతో పాటు సెక్యూరిటీ, ఇతరత్రా వాటి కోసం గదుల నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. తమకు ఎంతమేర భూమి కావాలనేది నిర్ధారించుకొని చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ఇనుప రాడ్లనూ సరిహద్దుపై ఏర్పాటు చేశారు. దీనిపై గతంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.
లావూనీ పట్టా భూములను ఆయా రైతులు మాత్రమే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే ప్రభుత్వ స్వాధీనంలో ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు రహస్యంగా వాటిని లీజు రాయించుకోవడంతో పాటు బహిరంగంగా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఇప్పటికే కిలోమీటరుకు పైగా రహదారి నిర్మాణం కూడా పూర్తయింది. దీంతో రెవిన్యూ అధికారులు కొన్నిరోజుల కిందటే అక్కడికి వచ్చి విచారణ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఆ పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వ భూమి కబ్జా అవుతుందని కిందిస్థాయి అధికారులు నివేదిక కూడా ఇచ్చారు. వాస్తవానికి వెంటనే అధికారులు రంగంలోకి దిగి పనులు నిలిపివేయాల్సి ఉండగా… కేవలం రైతులు, సదరు ప్రైవేటు సంస్థకు చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
అక్కడ యథేచ్ఛగా పనులు జరుగుతున్నా అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు ఇబ్రహీంపట్నం మండలం అనాజీపూర్ గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 281లో దాదాపు 300 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఇందులో కొంతమేర పట్టా ఉండగా… దాదాపు 80-100 ఎకరాల వరకు సీలింగ్ పట్టా భూములు ఉన్నాయి. దీంతో ఆ భూములను కూడా కలుపుకొని భారీ వెంచర్‌కు రంగం సిద్ధం చేశారు.
పెద్దల హస్తంతోనే పీవోటీ డ్రామా
నిరుపేద రైతులు వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను కొన్ని సందర్భాల్లో తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రజా ప్రయోజనాలతోపాటు ఆ భూముల్ని సదరు రైతులు దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించినపుడు అధికారులు పీవోటీ కింద సేకరిస్తారు. ఇక్కడ రైతులతో సదరు ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తులు రహస్యంగా 99 సంవత్సరాల లీజు కొంద ఆ భూములను కొనుగోలు చేసినట్టు తెలిసింది. పైగా బహిరంగంగానే అసైన్డ్ భూముల్లో రహదారులు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో మీడియా, ఇతరులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నోటీసులు ఇచ్చిన అధికారులు వాటి స్వాధీనానికి ప్రయత్నించినప్పటికీ.. ఈ వ్యవహారం వెనక ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉండటంతో అధికారులు వెనక్కి తగ్గినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
స్థానికంగానైతే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారితోపాటు వారి సోదరుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని అధికారికంగానే చేసేందుకు పీవోటీ డ్రామా తెరపైకి తీసుకువస్తున్నట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ అధికారులు పీవోటీ కింద రైతుల నుంచి ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటే… ప్రజా ప్రయోజనాల కోసమని సదరు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వం నుంచి నామమాత్రపు రేటు ఆ భూముల్ని కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం అధికారుల సలహా, సహకారంతోనే భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది.
నోటీసులు ఇచ్చాం…స్వాధీనం చేసుకుంటాం
ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 189లో గల ప్రభుత్వ భూమి నుంచి రోడ్డు వేసినట్టు దృష్టికి వచ్చింది. ఈ భూమి అసైన్డ్ పొందిన రైతులకు, రియల్ ఎస్టేట్ సంస్థ యజమానులకు నోటీసులు ఇచ్చాం. గడువులోపు సరైన సమాధానం ఇవ్వకపోతే పీవోటీ కింద ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం. అనాజ్‌పూర్ గ్రామంలో కూడ సీలింగ్ పట్టాల క్రయ విక్రయాలపై కూడా విచారణ జరుపుతున్నాం. క్రయ విక్రయాలు జరిగినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం.
– అనంతరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో