కేశంపేట: సొంత ఊరికి ఏదైనా చేయాలనుకున్న ఆ వ్యక్తికి ఆలోచన వచ్చిందే అదునుగా తనకున్న వ్యవసాయ భూమిలో 20గుంటల భూమి ఆలయ నిర్మాణంకోసం కేటాయించాడు. తన శక్తి మేరకు సొంత డబ్బులను వెచ్చించి వెంకటేశ్వరస్వామి, అలివేముమంగ పద్మావతి అమ్మవార్ల ఆలయం నిర్మాణానికి (Venkateswara swamy temple) శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణానికి అధిక మొత్తంలో నిధులు అవసరమవుతుండడంతో తన వద్ద ఉన్న డబ్బులు చాలక ఆర్థిక భారాన్ని భరించలేక దేవాదాయశాఖలో విలీనం చేశారు. ప్రారంభంలో కొంతమేర పనులు చేసినప్పటికీ.. దేవాదాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ ఆలయ నిర్మాణం పూర్తికాలేదు. గత 11 ఏండ్లుగా నిర్మాణంలోనే ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
రంగారెడ్డి జిల్లా కేశంపేట (Keshampet) మండలం బొదునంపల్లి గ్రామానికి చెందిన హరీశ్వర్‌రెడ్డి తన సొంత ఊరికి ఏదైనా చేయలన్న ఉద్దేశంతో తనకున్న వ్యవసాయ భూమిలో 20 గుంటల భూమిని వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణంకోసం కేటాయించుకున్నారు. తన సొంత డబ్బులతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతుండడంతో ఆర్థిక భారంవల్ల దేవాదాయశాఖలో విలీనం చేశాడని గ్రామస్తులు చెబుతున్నారు.
చలనంలేని దేవాదాయశాఖ
బొదునంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు 11ఏళ్లుగా సాగుతున్నాయంటే దేవాదాయఖ అధికారుల పనితీరును అర్థం చేసుకోవచ్చని గ్రామస్తులు వాపోతున్నారు. పల్లెల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతోపాటు మన సంస్కృతీ సాంప్రాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో వ్యవహరించే దేవాదాయశాఖ అంటిముట్టనట్లు వ్యవహరిస్తుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు స్పందించి ఆలయ నిర్మాణంలో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
దాతలైనా స్పందించాలి..
దేవాదాయశాఖ అధికారులు పనులను నత్తనడకన చేస్తుండడంతో నిర్మిణం ముందుకు సాగడంలేదని గ్రామానికి చెందిన హరికుమార్ అన్నారు. అనుకున్న బడ్జెట్ కంటే అధికమొత్తం డబ్బులు అవసరమవుతుండడంతో పనులు ముందుకు సాగడంలేదని చెప్పారు. దాతలు ముందుకొచ్చి ఆలయానికి అండగా నిలిచి నిర్మాణాన్ని పూర్తి చేసేలా కృషి చేస్తే బాగుంటుందన్నారు. అటు అధికారులైనా, ఇటు దాతలైనా ఎవరైనా స్పందించి త్వరలో ప్రారంభించేందుకు కృషి చేయాలని చెప్పారు.
పదకొండేళ్లుగా ఎదురుచూస్తున్నాం..
వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంకోసం గత పదకొండేళ్లుగా ఎదురుచూస్తున్నామని బొందుపల్లికి చెందిన పాండు అన్నారు. పలుమార్లు దేవాదాయశాఖ అధికారులవద్దకు వెల్లినప్పుడు సమాధానం బాగానే వస్తున్నా పనుల్లో వేగం మాత్రం లేదని చెప్పారు. దీంతో ఇప్పటి వరకు ఇంకా మరో 20 శాతం పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరారు. లేనిపక్షంలో గ్రామస్తులందరు తలోచేయి వేసి మిగిలిన పనులు పూర్తి చేస్తే బాగుంటుందని వెల్లడించారు.