ENC | ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఈఎన్సీని నియమించింది. గత నెలలో పదవీ విరమణ పొందిన అంజద్ హుస్సేన్ స్థానంలో ఓలేటి వెంకట రమేశ్ బాబును నియమించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ నియమాకంపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెంకట రమేశ్‌బాబుకు ఈఎన్సీగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన సూర్యాపేట, ఖమ్మం జిల్లాల చీఫ్ ఇంజినీర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఇరిగేషన్లో ఈఎన్సీ(జనరల్) స్థానం అత్యంత కీలకం. గతంలో ఈ శాఖను 19 టెరిటో రియల్స్‌గా విభజించగా మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ఆయా చీఫ్ ఇంజినీర్లకే బాధ్యతలను అప్పగించింది. అన్ని విభాగాలపై పూర్తిస్థాయి నిర్ణయాధికారాన్ని ఈఎన్సీకే కట్టబెట్టింది. ఇరిగేషన్ శాఖ, డ్యామ్ సేఫ్టీకి సంబంధించి రాష్ట్రస్థాయి కమిటీల్లోనూ ఈఎన్సీకే పూర్తి అధికారాలున్నాయి. ఇప్పటివరకు ఈఎన్సీగా పనిచేసిన అంజద్ హుస్సేన్ జనవరి 31న విరమణ పొందారు. సాధారణంగా కీలకమైన స్థానం ఖాళీ అవుతుంటే ముందుగానే తాత్కాలికంగానైనా ఇన్చార్జిని నియమించడం పరిపాటి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజులైనా భర్తీ చేయకపోవడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. అయితే ఈఎన్సీ జనరల్ స్థానం భర్తీ కాకపోవడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ మధ్య పేచీనే కారణమనే చర్చ జోరుగా వినిపిస్తున్నది.