హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : నీటి పారుదల శాఖ ఈఎన్సీగా రమేశ్‌బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. రమేశ్‌బాబు సూర్యాపేట సీఈ, ప్రస్తుత ఈఎన్సీ(అడ్మిన్)గా ఉన్నారు. ఇక ఈఎన్సీ నియామకంతో పాటు పదోన్నతులు కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ అలసత్వంపై ‘నమస్తే తెలంగాణ’ శుక్రవారం ‘సీఎం, మంత్రి పేచీ!’ శీర్షికన కథనం ప్రచురించింది. నియామకంలో జాప్యానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కి మధ్య పేచీయే కారణమని జరుగుతున్న చర్చను అందులో ప్రస్తావించింది.
మంత్రి ఉత్తమ్ సహా ఓ ఉన్నతాధికారి రమేశ్‌బాబుకే ఈఎన్సీ(జనరల్)గా అవకాశమివ్వాలని పావులు కదుపుతున్నట్టు వెల్లడించింది. సీఎం మాత్రం రిటైర్డ్ ఈఎన్సీ జనరల్ అమ్జద్ హుస్సేన్‌కే మరో ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్టు పేర్కొన్నది. ఈ కథనంపై శాఖలో తీవ్ర చర్చ కాగా.. ఎట్టకేలకు సర్కార్‌లో కదలిక వచ్చి ఈఎన్సీ జనరల్‌గా రమేశ్‌బాబును నియమించింది.