హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ‘ఓట్ల కోసం ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలతో నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను జీతాలు చెల్లించలేని స్థితికి తెచ్చారు.. ఆర్టీసీ, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చి భవిష్యత్తులో అప్పులే పుట్టకుండా చేస్తున్నారు’ అంటూ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రజలు ఉచితాలకు ఆశపడి పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. శనివారం ఆయన విజయవాడలో ఉచిత పథకాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును ఉచితాల పేరిట పంచిపెడుతూ ఫొటోలకు పోజులిస్తున్నారని దెప్పి పొడిచారు. పాలకులు పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని విస్మరించడం విచారకరమని పేర్కొన్నారు. ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఆర్థికంగా ఎదిగారని గుర్తుచేశారు. భవిష్యత్తు తరాల గురించి ఎంతమంది పాలకులు ఆలోచిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని చురకలంటించారు. అనేకమంది చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారని, మందులు కూడా కొనలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం మినహా మరేదీ ఉచితంగా ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు.