హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో (Bus Accident) బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డ క్షతగాత్రులు, ప్రత్యక్ష సాక్షులు ప్రమాదం జరిగిన తీరు, బయటపడే వరకు అనుభవించిన మానసిక క్షోభను తల్చుకుని విలపిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వాళ్లు చేసిన హాహాకారాలను గుర్తుచేసుకుని ఉలిక్కి పడుతున్నారు. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డవాళ్లు గాయాలతో చికిత్స పొందుతున్నారు. మరణించిన వాళ్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి తోటి ప్రయాణికులకు సాయం చేసిన వారు కొందరైతే.. ఆ దారిలో వెళ్తూ చలించిపోయి ఆపన్న హస్తం అందించిన వారు మరికొందరు. ప్రమాదం జరిగినప్పుడు హైమా అనే ఓ మహిళ… ముందుగా పోలీసులకు సమాచారం అందించడం కీలకంగా మారింది. అలాగే కారులో వెళ్తున్న మరో వ్యక్తి… మంటల్లో చిక్కున్న బస్సును చూసి ఆగిపోయాడు. క్షతగాత్రులను 10 మందిని తన కారులోనే దవాఖానకు తరలించి… మానవత్వాన్ని చాటుకున్నాడు.
శివశంకర్ పని మాట్లాడుకోవడానికి గురువారం రాత్రి డోన్ పట్టణానికి వెళ్తున్నట్టు చెప్పి బయల్దేరాడు. రాత్రి 9 గంటలకు ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పాడు. అర్ధరాత్రైనా రాకపోవడంతో స్నేహితుల ఇంటి దగ్గర ఉన్నాడేమో అనుకున్నాం. ఇటీవల పెండ్లి చూపులు కూడా చూస్తున్నాం. కొడుకు చనిపోయి నాకు కడుపుకోత మిగిల్చాడు. బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే నా కుమారుడు చనిపోయాడు. బస్సు డ్రైవర్ చేసిన తప్పు మా ఇంట్లో తీవ్ర విషాదం నింపింది.
-బస్సు ఢీకొట్టడంతో చనిపోయిన బైకర్ శివశంకర్ తల్లి
మాది నెల్లూరు జిల్లా. బెంగళూరులో ఉంటాం. దీపావళికి హైదరాబాద్ వచ్చి వెళ్తున్నాం. బస్సు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఏమైందో తెలిసేలోపే మంటలు వ్యాపించాయి. నేను, నాభార్య, పిల్లలు ఎమర్జెన్సీ విండో గ్లాస్ పగలగొట్టి బయటకు వచ్చాం. కిందకు వచ్చి చూసేసరికి మా అన్న, వదిన, వారి కుమారుడు, కుమార్తె ఎక్కడున్నారో అని వెతికితే కనిపించలేదు. బస్సులో అప్పటికే మంటలు వ్యాపించాయి. నా కండ్ల ముందే మా అన్న కుటుంబం కాలి బూడిదైంది.
-మృతుడు రమేశ్ సోదరుడు, క్షతగాత్రుడు
నేను బస్సు వెనుక సీట్లో ఉన్నా. సడెన్గా బస్సు ఆగిపోయింది. నిద్రలోంచి తేరుకుని చూస్తే ప్రయాణికులు అరుపులతో కిందికి వెళ్తున్నారు. వెంటనే నా పక్కనే ఉన్న తోటి ప్రయాణికుడు నన్ను తట్టి లేపాడు. ఆయన బయటకు దూకి నన్ను కూడా కిందకు లాగాడు. కింద పడిపోయిన నాకు కొద్దిసేపటి వరకు ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. తేరుకుని చూసేసరికి బస్సంతా మంటలు వ్యాపించి, పేలిన శబ్దాలు వినిపించాయి. క్షణాల్లోనే బస్సంతా కాలిపోయింది. బతికి బయటపడ్డ వారందరినీ దవాఖానలకు తరలించారు.
– రామారెడ్డి, క్షతగాత్రుడు
కర్నూలు బస్సు ప్రమాదం ఘటన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. బస్సులో ఎక్కడ చూసినా అస్థిపంజరాలు, మాంసపు ముద్దలు ఉన్నాయి. షిరిడీ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు కాలిపోవడం చూసి ఆగాను. అక్కడికెళ్లి చూసే సరికి బస్సు భారీగా ఎగిసిపడుతున్న మంటల్లో కాలిపోతున్నది. కాలుతున్న బస్సులోని మృతదేహాలను చూస్తే కన్నీళ్లు ఆగలేదు. నేను అక్కడికి చేరుకోగానే వెంటనే కర్నూలు పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమాచారమిచ్చాను. స్పందించిన పోలీసులు వెంటనే కర్నూలు రూరల్ సీఐ బృందాన్ని అక్కడికి పంపారు. అప్పటికే ఒకరిద్దరు కొంతమంది క్షతగాత్రులను ప్రైవేట్ దవాఖానలకు తరలించారు.
– హైమా, ప్రత్యక్ష సాక్షి