Rajanna Kodelu | కరీంనగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వేములవాడ: వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి పట్టడానికి మితిమీరిన రాజకీయ జోక్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నాయకుల అండదండలతోనే కొంతమంది అక్రమార్కులు వాటిని ఇష్టానుసారం తీసుకెళ్లి కబేళాలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజన్న కోడెలను తమ అనుచరులకు ఇవ్వాలంటూ స్థానిక రాజకీయ నాయకుల నుంచి మంత్రుల వరకు చేస్తున్న పైరవీలు, అధికారులపై ప్రయోగిస్తున్న ఒత్తిళ్లు కోడెల ఉనికినే ప్రశ్నార్థంగా మార్చేస్తున్నాయి. వాటిని సమర్పించిన భక్తుల విశ్వాసంపై దెబ్బ కొడుతున్నాయి. ఈ తీరు మారాలంటే ప్రభుత్వం మరింత పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాజన్న కోడెలను గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తింపు పొందిన గోశాలలకు వారి వారి అభ్యర్థన మేరకు ఇచ్చేవారు. జనవరిలో కొన్ని అక్రమాలు బయటపడిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా, దేవస్థానం ఈవో కన్వీనర్‌గా వివిధ శాఖల అధికారులతో ఒక కమిటీని నియమించారు. మే లో ఈ కమిటీ ఏర్పాటు కాగా, జూన్ ఒకటి నుంచి కమిటీ నియమ, నిబంధనలకు అనుగుణంగా కోడెలను పంపిణీ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.
దేవస్థానం గోశాలలో కోడెలు అదనంగా ఉన్నప్పుడు నిజమైన రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం కోడెలను ఇవ్వాలనేది కమిటీ నిబంధన. రైతుగా వ్యవసాయ అధికారి ధ్రువీకరణ పత్రం, సదరు రైతు పట్టాదారు పాసుపుసక్తం, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ వంటి వివరాలు సేకరించి.. జిల్లా వెటర్నరీ అధికారుల సమక్షంలో పంచనామా చేసి.. సంబంధిత రైతులకు కోడెలను ఇవ్వాలని కమిటీ నిబంధన పెట్టింది. కోడెలు సదరు రైతులకు ముట్టినట్టు సంతకం తీసుకోవాలి. ఒకవేళ కోడెలను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేలా అంగీకారపత్రం కూడా తీసుకోవాలి.
ఒకవేళ సదరు రైతు తాను తీసుకెళ్లిన కోడెలను ఏదైనా కారణంతో పోషించలేని పరిస్థితి వస్తే, వాటిని తిరిగి గోశాలకు అప్పగించవచ్చు. ఒకవేళ, తాము తీసుకెళ్లిన కోడెలు చనిపోతే గ్రామ అధికారితో ధ్రువీకరణ పత్రం తెచ్చి దేవాలయ అధికారులకు సమర్పించాలి. ఈ నిబంధనలు గత జూన్ నుంచి అమల్లోకి వచ్చాయి. నిబంధనలు బాగానే ఉన్నా ఆచరణలో అందకు భిన్నంగా సాగుతున్నది. దీనికి నిలువెత్తు నిదర్శనం తాజాగా గీసుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన అంశం. కేవలం ముగ్గురు వ్యక్తులు వచ్చి.. బినామీ రైతుల పేర్లతో 66 కోడెలను తీసుకెళ్లి, అందులో 28 కోడెలను కబేళాకు విక్రయించిన తీరు నిబంధనల పాతరకు నిలువెత్తు నిదర్శనం.
కమిటీ నిబంధనల ప్రకారం మొదట్లో అధికారులు పకడ్బందీగానే పంపిణీచేసే ప్రయత్నం చేశారు. అసరం ఉన్న రైతులు దేవస్థానం గోశాలకు ప్రత్యక్షంగా నేరుగా వస్తే వారి ఫొటోలు తీసుకొని.. తగిన పత్రాలు పరిశీలించి పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. కానీ, అతి కొద్ది సమయంలోనే ఈనిబంధనలకు నీళ్లొదిలారు. వివిధ ప్రాంతాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల జోక్యం పెరిగింది. స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు.. యాభైమందికిపైగా వ్యక్తులను సిఫారసు చేసినట్టు తెలుస్తున్నది.
ఎవరైనా దరఖాస్తు చేస్తే చాలు.. ఆయా ప్రజాప్రతినిధులు దానిని ఎండార్స్ చేస్తూ అధికారుల వద్దకు పంపిస్తున్నారు. కొంతమంది ప్రజానిధులు సిఫారసు లేఖలు పంపిస్తే, మరికొందరు తెల్లకాగితంపై చీటీలు రాసి పంపిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇలా ఒత్తిళ్లు ప్రయోగిస్తున్న వారిలో మెజార్టీ వ్యక్తులు నిజమైన రైతులు కారు. వ్యాపారానికి రుచి మరిగిన కొంతమంది ఈ పైరవీలకు అలవాటు పడ్డారని తెలుస్తున్నది.
వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎండార్స్ చేసిన లేఖలను తీసుకొచ్చి అధికారులపై సదరు వ్యక్తులు ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. తాము నో చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని ఒక అధికారి తెలిపారు. కోడెలు ఇవ్వడం కుదరదని చెప్తే, సదరు ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా ఫోన్లు వస్తున్నాయని అధికారులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధుల మెప్పు కోసం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కోడెలను ఇస్తున్నారని తెలుస్తున్నది. తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ముగ్గురు వ్యక్తులకు 66 కోడెలు ఇచ్చిన వ్యవహారం వెలుగు చూడటం అందులో భాగమేనన్న అభ్రిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తీసుకెళ్లిన వాటిలో 28 కోడెలను కబేళాకు విక్రయించడం దారుణం. తాజాగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వెలుగు చూసిన ఒక సంఘటన మాత్రమే ఇది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత గత జూన్ ఒకటి నుంచి నవంబర్ వరకు 1,734 కోడెలను రైతులకు పంపిణీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. అందులో ప్రస్తుతం రైతుల వద్ద ఉన్నవి ఎన్ని? కబేళాకు తరలినవి ఎన్ని? చనిపోయిన వాటి సంఖ్య ఎంత? కబేళాకు గీసుకొండ మండలం నుంచి మాత్రమే తరలిస్తున్నారా? మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే దందా నడుస్తున్నదా? అన్న అంశాలపై లోతుగా విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బయటకు రావు.
నిజంగా ఈ తరహా వ్యాపారం ఒక్క గీసుకొండలో మాత్రమే జరిగిందా? లేక ఇతర మండలాల్లోనూ కొనసాగుతున్నదా? అన్నది తెలియాలంటే ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయాలి. దేవాలయ అధికారులు పంపిణీ చేసిన జాబితా ప్రకారం సంబంధిత పోలీసుస్టేషన్ల ద్వారా సమగ్రంగా విచారణ జరిపిస్తే మొత్తం అక్రమాలు బయటపడతాయని, కబేళాకు ఇంకా ఎవరెవరు తరలిస్తున్నారనే లింకులు బయట పడతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, దేవాదాయ శాఖ ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కేవలం ఇద్దరు అధికారులను వరంగల్ ఉమ్మడి జిల్లాకు పంపించి నామమాత్రపు విచారణ చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి.
అక్రమ విక్రయాలకు అడ్డకట్ట వేయాలంటే, సాంకేతిక రంగాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంపిణీ వ్యవస్థ అంతా కాగితాల మీదనే అమలవుతున్నది. దేవస్థానం అధికారులు రికార్డులు రాసుకోవడం, అందులో ఏ గ్రామ రైతుకు ఎప్పుడు, ఎన్ని కోడెలు ఇచ్చారన్న వివరాలు బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉంచడం వంటివి చేస్తున్నారు. ఒకే ఆధార్‌కార్డుపై తీసుకెళ్లిన వారే మళ్లీ మళ్లీ తీసుకెళ్తున్నారు.
ఇలాంటివాటిని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారుచేసి, అందులోనే కోడెలు అవసరం ఉన్న రైతులు నేరుగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. దరఖాస్తుదారుల వివరాలు సైట్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని, అప్పుడే, దొంగల భరతం పట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి ఒక ఆధార్‌కార్డు ఎంట్రీ అయితే, మళ్లీ అదే ఆధార్‌కార్డు పేరిట ఎంట్రీకి అవకాశం లేకుండా చూడాలి. అప్పుడు ఒకే వ్యక్తి పదేపదే తన అధార్కార్డుపై కోడెలను తీసుకెళ్లడానికి అవకాశం ఉండదు.
రైతులకు ఇచ్చే కోడెలకు జియోట్యాగింగ్ చేయాలి. ఏ గ్రామ రైతుకు ఎన్ని కోడెలు ఇచ్చారో తెలుపుతూ సంబంధిత గ్రామ కార్యదర్శులకు అదేశాలు వెళ్లేలా టెక్నాలజీ ఉండాలి. ముఖ్యంగా ఈ వివరాలను పంచాయతీ, రెవెన్యూ అధికారులతో అనుసంధానం చేస్తే.. తప్పులు జరగకుండా ఉండే అవకాశంతోపాటు నిజమైన రైతులకు రాజన్న కోడెలు ఉపయోగపడుతాయి. దరఖాస్తుదారుల సీనియారిటీ ప్రకారం, ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే అందులో అర్హులైన వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. తద్వారా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.