Vemula Prashanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సభ్యులను తిట్టడానికి, అవమానించడానికి, బెదిరించడానికి, కేసీఆర్ మీద ఏడ్వటానికి అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నారని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బుల్డో జ్ సమావేశాలుగా మార్చిందని విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్లో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొకారని, డిమాండ్లపై రెండు రోజులే చర్చ జరిపారని మండిపడ్డారు. తనకు పద్దులపై మాట్లాడే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి స్థాయి చర్చ లేకుండా ఆమోదించుకున్నారని తెలిపారు.
రేవంత్‌ది ప్రజాపాలన కాదు ప్రతిపక్షాలపై పంజావిసిరే పాలన అని ఎద్దేవా చేశారు. 7 నెలల పాలనలోనే రేవంత్ వికృత చేష్టలు బయటపడ్డాయని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి సభానాయకుడిగా కాకుండా, ఆటవిక రాజ్యానికి రాజులా వ్యవహరించారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ మీద తిట్ల దండకం కోసం అసెంబ్లీ సమావేశాలు జరిగినట్టు ఉన్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యులు బాగా మాట్లాడుతున్నప్పుడల్లా తప్పుడు పత్రాలతో సీఎం సభకు వచ్చి చర్చను పకదారి పట్టించారని ఆరోపించారు. గ్యారంటీలు అని చెప్పి రేవంత్ అధికారంలోకి వచ్చారని, బడ్జెట్లో వాటి ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి నుంచి నిలదీస్తే తమను రెండు సార్లు మార్షల్స్‌తో బయటకు ఎత్తిపడేశారని తెలిపారు.
అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎంల అబద్ధాలకు లెకే లేదని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం నిండు సభలో అబద్ధాలు ఆడారని గుర్తుచేశారు. ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇవ్వటం ఎలా సాధ్యమో మేధావులు ఆలోచించాలని సూచించారు. సీఎంగా ఉండి ఇంత పచ్చి అబద్ధాలు ఆడవచ్చా? అని ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తమ ఎమ్మెల్యే హరీశ్‌రావు అప్పుల గురించి చెప్తుంటే సీఎం విద్యుత్తు మీటర్లపై తప్పుడు పత్రం తెచ్చి సభను తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఆ అబద్ధాల అలవాటు డిప్యూటీ సీఎం భట్టికి కూడా వచ్చిందని విమర్శించారు. రేవంత్‌ను అతిపెద్ద అబద్ధాల కోరుగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలని అన్నారు. రూ.75 కోట్లతోనే సీతారాంసాగర్ ప్రాజెక్టు కింద లక్షన్నర ఎకరాలకు నీళ్లిచ్చామని భట్టి ఘోరమైన అబద్ధం ఆడారని అన్నారు. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని, భట్టిని ప్రధాని మోదీ తన క్యాబినెట్లోకి తీసుకోవాలని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ ద్రవ్య వినిమయ బిల్లుపై వాస్తవాలు చెప్తుంటే సీఎం జోక్యం చేసుకుని మహిళా ఎమ్మెల్యేలను దూషించి కంటతడి పెట్టించారని వేముల మండిపడ్డారు. నాలుగున్నర గంటలపాటు మహిళాఎమ్మెల్యేలు బతిమిలాడినా మైక్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డిని తిట్టించేందుకు కోమటిరెడ్డికి రేవంత్ మైక్ ఇప్పించారని తెలిపారు. దానం నాగేందర్ తమతో ఉన్నపుడు బాగానే ఉన్నారని, అటు వెళ్లగానే సీఎంలాగే బూతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పైగా, దానం మాటలను రేవంత్ సమర్థించేలా మాట్లాడటం సిగ్గు చేటు అని అన్నారు.
‘ఆసరా పెన్షన్లను రూ.4 వేలు చేయటానికి పైసల్లేవు అని సీఎం అంటున్నారు. మరి మూసీకి రూ.లక్షా 50 వేల కోట్లు ఎక్కడివి?’ అని రేవంత్‌ను ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. కేసీఆర్ సలహాదారులను నియమించుకుంటే తప్పుబట్టిన రేవంత్.. ఇప్పుడు ఎందుకు నియమించుకుంటున్నారని ప్రశ్నించారు. ‘ఎవడబ్బ సొమ్మని రేవంత్‌రెడ్డి సలహాదారులను నియమించుకున్నారు? ఎవడబ్బ సొమ్మని ప్రభుత్వ ప్రకటనలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నవ్?’ అని ధ్వజమెత్తారు. పంజాబ్‌లో రైతులకు కేసీఆర్ సాయం చేస్తే తప్పుబట్టారని, ఈ రోజు వయనాడ్‌కు ఎందుకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పంపుతున్నావ్? అని సీఎంను ఏకిపారేశారు. కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి సాయం చేయాలని డిమాండ్ చేశారు.