వేల్పూర్, మే 10: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నెలరోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఆదివారం ఆయన వేల్పూర్‌లో మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించినట్టు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సోమవారం రైతు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించి కేంద్రాలు తెరిచే సరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్టుగా 20 రోజులపాటు కావాలనే జాప్యం చేసిందని ఆరోపించారు. మద్దతు ధర రూ.2,390 ఉండగా ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యక్తులకు రూ.1,750 నుంచి రూ. 1900లకే విక్రయిస్తూ ఎకరాకు సుమారు రూ.15 వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైస్‌మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఫోన్ ఎత్తని కలెక్టర్ రైతుల సమస్యలపై మాట్లాడేందుకు కలెక్టర్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడంలేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదా? అని ఎమ్మెల్యే వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలసీలో భాగమేనని ఆరోపించారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, లారీలను పెంచాలని, గన్నీల కొరత తీర్చాలని, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలని, దొడ్డు రకానికీ రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు బీఆర్ఎస్ విశ్రమించేది లేదని స్పష్టంచేశారు.