హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కక్షసాధింపు చర్యలకు పాల్పడినా, ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ సైనికులు భయపడరని, దీటుగానే ఎదుర్కొంటారని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి పేర్కొన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా.. రేవంత్ సర్కార్ సిట్ పేరుతో డ్రామా ఆడుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే సీమ్‌ల ప్రభుత్వమని, కాంగ్రెస్ అంటే స్కామ్‌ల ప్రభుత్వమని మధుసూదనాచారి తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచెయ్యాలని బీఆర్ఎస్ చీల్చి చెండాడుతుండటంతోనే కేసులు పెడుతున్నారని, నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోతున్నారని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ కోసం హరీశ్‌రావు ప్రాణత్యాగానికి సిద్ధపడిన వ్యక్తి అని గుర్తుచేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్, ఆ పార్టీ నేతలపై కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తంచేశారు. ఈ కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వ కుంభకోణాలపై సిట్ వేయాలి : నిరంజన్‌రెడ్డి
సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్ట్ బయటపెట్టినందుకే హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చి విచారించిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రెండేండ్ల నుంచి మంత్రులు అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని, ఈ కుంభకోణాలపై శాసనసభలో, ప్రజా క్షేత్రంలో నిలదీస్తున్నందునే తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. పాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఒకసారి కాళేశ్వరం కేసు, ఇంకోసారి కార్‌రేస్ కేసు, మరోసారి విద్యుత్తు కేసు అని విచారణ పేరుతో పిలుస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై నిలదీస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదని, దానికి నాయకుడు రేవంత్ అని తీవ్రంగా మండిపడ్డారు. సివిల్ సప్లయ్‌లో, సమ్మక సారక టెండర్లలో, పారిశ్రామిక భూముల విషయంలో స్కామ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. హ్యామ్ రోడ్ల పేరుతో భారీ కుంభకోణం జరుగబోతుందని చెప్పారు. రూ.1600 కోట్ల విలువైన బొగ్గు గనుల కాంట్రాక్ట్ విషయంలోనే ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలపై తక్షణం సిట్ వేయాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌చేశారు. తాము కేసీఆర్ సైనికులమని దేనికీ భయపడబోమని, ప్రభుత్వ స్కామ్‌లపై ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.
స్కామ్‌లు బయటపెడితే నోటీసులివ్వడం హేయం: వద్దిరాజు
రెండేండ్లుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని, సీరియల్‌ను తలపించేలా రోజుకో కేసు పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు బొగ్గు సామ్ బయటపెడితే నోటీసులు ఇచ్చి విచారించడం హేయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు కేసులు కొత్త కాదని తెలిపారు. ఉద్యమ సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు అనేక సార్లు జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ సైనికులను ఏమీ చేయలేరని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఎంత వేధిస్తే, అంతకు వందరెట్లు తెలంగాణ సమాజం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని హెచ్చరించారు. బొగ్గు స్కామ్‌పై విచారణ జరుపాలని, ఈ కుంభకోణంపై తాను పార్లమెంట్లో మాట్లాడుతానని తెలిపారు.