వేల్పూర్/మోర్తాడ్, అక్టోబర్ 9: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా వాటిని అమలు చేయడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మితోపాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైంది? ప్రతి మహిళకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న డబ్బులు ఎటు పోయాయని ప్రశ్నించారు.
హామీలు అమలు చేయకుండా మూసీ జపం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా బీఆర్ఎస్ తరఫున వెంటాడుతామని స్పష్టంచేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్, బాల్కొండ, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను వేముల పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదింట్లో ఆడబిడ్డల పెండ్లి చేయడం ఎంత కష్టమో కండ్లతో చూసిన అప్పటి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారని, ఇది ఎంతో మంది పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని సక్రమంగా అమలు చేయని సర్కార్.. రూ.1.50 లక్షల కోట్లతో ఎవరికి పనికి రాని మూసీ ప్రక్షాళన చేస్తామనడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
తులం బంగారం హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వానికి విన్నవించాలని వేముల సూచించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అధికార పార్టీ నేతలు గొడవకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను గుర్తు చేస్తుంటే అసహనానికి గురై, అనవసరంగా రాద్ధ్దాంతం చేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. హామీలు నెరవేర్చాలని ప్రజలంతా అడుగుతుంటే కాంగ్రెస్ నేతలు గత ప్రభుత్వంపై నిందలు మోపి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం చెక్కులు తీసుకుంటున్న వారంతా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెండ్లి జరిగిన వారేనని తెలిపారు.
నాయకులను
నిలదీసిన లబ్ధిదారులు‘మీ ప్రభుత్వం వచ్చాకే మా బిడ్డలకు పెండ్లిళ్లు అయ్యాయి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం రూ.లక్షతోపాటు తులం బంగారం అందించాలి’ అని అక్కడున్న మహిళలు కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. లబ్ధిదారులు అడుగుతున్న ప్రశ్నలకు అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని వేముల డిమాండ్ చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసి తప్పించుకున్నా బీఆర్ఎస్ మాత్రం విడిచి పెట్టదని, అన్ని హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.