భీమ్‌గల్, ఫిబ్రవరి 5: నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్‌ను మున్సిపాలిటీగా చేయడంతోపాటు రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయడం బీఆర్ఎస్తోనే సాధ్యమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తాము మొదలు పెట్టిన పనులన్నీ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమ్‌గల్‌లోని పలు వార్డుల్లో వేముల గురువారం రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మురికికూపంగా ఉన్న భీమ్‌గల్‌ను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ది అని కొనియాడారు. రూ.వందల కోట్లు వెచ్చించి రోడ్లు, డివైడర్లు, డ్రైనేజీలు నిర్మించామని గుర్తుచేశారు.
తాము మంజూరు చేసిన పనులను రెండేండ్లుగా ఆపేసిన కాంగ్రెస్.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాగానే హడావుడిగా శంకుస్థాపనలు చేసిందని విమర్శించారు. ఎన్నికలు లేకుంటే పనులు చేయరా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేవుడి పేరు మీద రాజకీయాలు చేయడం తప్ప తెలంగాణ అభివృద్ధికి అదనంగా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను ఆదరించాలని, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పారీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.