హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): అమరజ్యోతి నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మతిలేని మరుగుజ్జు మాటలు మాట్లాడుతున్నారని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గురించి ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటే ఓర్వలేని సంకుచిత మనస్తత్వంతో రేవంత్ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరజ్యోతిని కేసీఆర్ ప్రభుత్వం ఎంతో గొప్పగా మనసు పెట్టి నిర్మించిందని, ఓట్ల రాజకీయాల కోసం కాదని స్పష్టంచేశారు. ఒకసారి రేవంత్‌రెడ్డి అమరజ్యోతిని సందర్శిస్తే నిర్మాణ గొప్పతనం అర్థమవుతుందని సూచించారు. కాంగ్రెస్ చేసిన జాప్యం, గందరగోళ ప్రకటనల వల్లనే బలిదానాలు జరిగాయని, ఇందుకు సోనియాగాంధీయే కారణమని ఆరోపించారు. 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని, కామన్ మినిమం ప్రోగ్రాం (సీఎంపీ)లో చేర్చి, ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసి వెనకు తీసుకున్నారని, అందుకే బలిదానాలు జరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు.
విద్యార్థులను సోనియాగాంధీ బలి తీసుకుంటున్నదని, ఆమెను తెలంగాణ బలిదేవత అంటూ నాడు విమర్శించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు అమరుల కుటుంబాలతో సోనియా సహపంక్తి భోజనాలు చేస్తారని చెప్పడం విడ్డూరంగా, విచిత్రంగా ఉన్నదని వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వారిని తామే చంపామని ప్రాయశ్చిత్తం చేసుకుంటారా? అని ప్రశ్నించారు. అమరుల కుటుంబాల పాదాలు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నా కాంగ్రెస్ చేసిన పాపం పోదని ఎద్దేవా చేశారు. అమరజ్యోతి లాంటి నిర్మాణం కాంగ్రెస్ వల్ల కాదని, ఆ మనసు వారికి లేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం యావత్ తెలంగాణ సమాజం గర్వించే రీతిలో పూర్తి పారదర్శకంగా అమరజ్యోతిని నిర్మించిందని స్పష్టంచేశారు. 50 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ భారత స్వాతంత్య్ర అమరవీరులకు ఒక స్మారకాన్ని ఢిల్లీలో ఎందుకు కట్టించలేదని ప్రశ్నించారు.