హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. గల్లీలో దందాలు చేస్తూ.. ఢిల్లీలో గులాంగిరీ చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు రేవంత్‌రెడ్డే అసలైన శత్రువు అని దుయ్యబట్టారు. ఢిల్లీలో రెండు రోజులు పడిగాపులు కాసినా పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్ దొరకలేదన్న ప్రస్టేషన్లో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక్కటేనంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నిజానికి రేవంత్‌రెడ్డి, బీజేపీ ఒక్కటే అని, వారి దోస్తానా చాలాసార్లు బయటపడిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, కానీ కాంగ్రెస్‌కు మాత్రం ఢిల్లీ ప్రయోజనాలే ముఖ్యమని వేముల పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఉంటే.. తెలంగాణకు ఈ గతి పట్టేదా? అని ప్రశ్నించారు. మంత్రుల శాఖల కేటాయింపులో కూడా ఏమీచేయలేని నిస్సహాయక స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి.. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో మోకరిల్లేలా చేస్తున్నారని విమర్శించారు. మూడు రోజుల్లో కాళేశ్వరంపై మాట్లాడుతానని అంటున్న రేవంత్‌రెడ్డీ.. అబద్ధాలతో కాళేశ్వరంపై ప్రజంటేషన్ కోసం వంటకం ఇంకా సిద్ధం కాలేదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ పార్టీ నేతలను ఆరెస్టు చేసి, జైళ్లో పెట్టాలన్న ఆలోచనే తప్ప.. పాలన మీద దృష్టి సారించారా? అని ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. కేసులు ఎలా పెట్టాలన్న అంశంపై కేటాయించే సమయాన్ని పాలనపై పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హితవు పలికారు. బీఆర్ఎస్ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు.. ఎంతమందిని జైళ్లో పెడుతావని ప్రశ్నించారు. ఎంతమందిని జైళ్లో పెట్టినా.. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. హామీల అమలు విషయంలో.. సీఎం రేవంత్‌రెడ్డి పిట్టలదొర మాదిరిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసే దాకా బీఆర్ఎస్ వెంటపడుతూనే ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, పార్టీ నాయకులుడు గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, బీజేపీతో సఖ్యతగా ఉంటున్న రేవంత్‌రెడ్డిని నమ్మవద్దని కాంగ్రెస్ నేతలకు ప్రశాంత్‌రెడ్డి సూచించారు. ఆయన ఏదో ఒకరోజు కాంగ్రెస్‌ను ఖతం చేసి, నాయకులను నట్టేట ముంచి.. బీజేపీలో చేరిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు.
కేసీఆర్ తెలంగాణ ఆత్మ అని వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణకు అసలు శత్రువు రేవంత్‌రెడ్డి అని నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టింది తమరు కాదా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నీటిని తరలించుకుపోతుంటే.. నోరు మూసుకున్న రేవంతే.. తెలంగాణకు అసలు శత్రువు అని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో తలసరి ఆదాయంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 4వ స్థానానికి, జీడీపీలో 4వ స్థానంలో ఉంటే.. 11వ స్థానానికి దిగజార్చిన తెలంగాణ శత్రువు తమరే అని మండిపడ్డారు. తెలంగాణ అప్పులపాలైందని, సీఎం హోదాలో ఢిల్లీకి వెళ్తే అక్కడ దొంగలా చూస్తున్నారంటూ రాష్ట్రం పరువు తీస్తున్న రేవంత్‌రెడ్డే తెలంగాణకు శత్రవు అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీకి కలిపి మొత్తం 16 మంది ఎంపీలున్నా.. కేంద్రం నుంచి తెలంగాణకు తెచ్చింది గుండుసున్నా అని దుయ్యబట్టారు. అదే 16 మంది ఎంపీలు బీఆర్ఎస్కు ఉన్నట్టయితే, ఏపీ మాదిరిగానే తెలంగాణకు నిధుల వరద పారేదని స్పష్టంచేశారు. ఏపీకి నిధులిస్తున్న కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని అసలు శత్రువులు కాంగ్రెస్, బీజేపీలేనని అగ్రహం వ్యక్తంచేశారు.
మల్కాజిగిరి, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ వంటి ఎంపీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ నుంచి బలహీనులైన అభ్యర్థులను నిలబెట్టారని, ఇప్పుడు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఒక్కరికి కూడా మంత్రి పదవులు ఇవ్వలేదని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి, బీజేపీ ఒక్కటేనని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిపై బీజేపీ నేతలు ఈగ కూడా వాలనీయడం లేదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని ఆరోపించినా.. ఇప్పటివరకు దానిపై ఎందుకు విచారణ జరపడంలేదని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ లభించకపోయినా, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ మాత్రం 15 నిమిషాల్లోనే దొరుకుతుందని పేర్కొన్నారు. ఇది వారిద్దరి మధ్య స్నేహబంధానికి సాక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని తొక్కడానికి రేవంత్‌రెడ్డి, బీజేపీ కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు.