మోర్తాడ్/ముప్కాల్, అక్టోబర్ 26: ‘కేసీఆర్ ముందే చెప్పిండ్రు. పొరపాటున వేరే ప్రభుత్వమొస్తే రైతుబంధుకు రాంరాం చెప్తరు అని. ఆయన అన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధుకు రాంరాం చెప్పింది’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రేవంత్ సర్కారు లేనిపోని కొర్రీలు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
బాల్కొండ నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం వేముల మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. డిసెంబర్ 9న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి 30శాతం మందికి మాత్రమే చేశారని విమర్శించారు. రేషన్‌కార్డు లేదని, భూమి వివరాలు సరిగా లేవని, బ్యాంకులో రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్నదని, మిగిలిన డబ్బులు చెల్లించాలని ఇలా ఎన్నో కొర్రీలు పెట్టి రుణమాఫీని ఆపడం రైతులను మోసం చేసినట్టేనని దుయ్యబట్టారు.
ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడేమో సన్నవడ్లకే ఇస్తం, దొడ్డు వడ్లకు ఇవ్వమని మొండికేస్తున్నారని మండిపడ్డారు. వడ్ల కోతలు మొదలై రైతులు అమ్ముకునేందుకు సిద్ధంగా ఉంటే ఇంకా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లేదని ధ్వజమెత్తారు. సంతోష్‌కుమార్ రాజ్యసభ సభ్యుడి ఉన్నప్పుడు కమ్మర్పల్లి సొసైటీ గోడౌన్‌కు రూ.10లక్షలు, కొనాసముందర్ సొసైటీ గోడౌన్‌కు రూ.10 లక్షలు మంజూరు చేశారని వేముల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల పంపిణీని సగానికి తగ్గించిందని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. గంగపుత్రుల పొట్ట కొట్టొద్దని సూచించారు.