హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నారని, కేసీఆర్ చేసిన పనులు తాము చేసినట్టు గొప్పలు చెప్పుకొంటున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. రీజినల్ రింగ్‌రోడ్డు పనులను తామే చేపట్టామని రెడ్డి హాస్టల్ సందర్శన సందర్భంగా వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రశాంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఏడాదిగా ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడుతున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన పనులను తామే చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. మందికి పుట్టిన బిడ్డను తమ బిడ్డగా ముద్దాడినట్టు వాళ్ల ధోరణి ఉంది.
హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలనేది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో పుట్టిన ఆలోచన. హైదరాబాద్‌ను కాస్మోపాలిటన్ సిటీగా అభివృద్ధి చేయడం, నగరాన్ని ఆనుకుని ఉన్న పట్టణాలను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. 100 కిలోమీటర్ల రేడియస్‌లో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు సంకల్పించారు. రీజినల్ రింగ్ రోడ్డులో ఉత్తర భాగంలో 160 కిలోమీటర్లకు రూ.12 వేల కోట్లు, దక్షిణ భాగానికి రూ.15000 కోట్లు వెచ్చించి ట్రిపుల్ఆర్ నిర్మించాలని 2015లో అంచనా వేశారు. ఇందులో 14 జాతీయ రహదారులు కలుస్తుండటంతో రాష్ట్రంపై భారం తగ్గించేందుకు కేంద్రం ఆధీనంలోని హైవే అథారిటీ ద్వారా ట్రిపుల్ఆర్ నిర్మించాలని కేసీఆర్ భావించారు. కేంద్రాన్ని భాగస్వామిగా చేస్తే మొత్తం రూ. 27 వేల కోట్లలో సగానిపైగా భారం తగ్గుతుందని భావించి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సంప్రదించారు. అని గుర్తుచేశారు.
రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం అనుమతులకు 2015 నుంచి 2017 వరకు పలుసార్లు సంప్రదించినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టును వదులుకోవద్దని భావించిన కేసీఆర్ 50 శాతం భూసేకరణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రానికి హామీ ఇవ్వడంతో దిగివచ్చిన కేంద్రం 2017లో సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పారు. కేంద్రం పనులు ప్రారంభించకపోవడంతో 2018 ఆగస్టు 27న నితిన్ గడ్కరీని కేసీఆర్ సంప్రదించారని, తాను కూడా 2019 అక్టోబర్ 29న గడ్కరీని కలిసి వినతిపత్రం ఇచ్చానని తెలిపారు. కేంద్రంపై కేసీఆర్ ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో ఉత్తర ప్రాంతంలో రీజినల్ రింగ్ రోడ్డును ‘భారత్ మాల’ ప్రాజెక్టులో చేపడుతామని కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్య 76 శాతం భూసేకరణ పూర్తయిందని, ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగాయని తెలిపారు. కానీ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎన్ని అబద్ధాలు చెప్పినా కేసీఆర్ చేసిన పనులే సమధానం చెబుతాయని స్పష్టంచేశారు.
దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేసీఆర్ హాయాంలోనే కేంద్రం సూత్రప్రాయంగా అనుమతించిందని ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. కానీ అప్పటి అలైన్మెంట్లో మార్పులు చేసి, కాంగ్రెస్ నేతల భూములున్న ప్రాంతాల మీదుగా నిర్మించేందుకు కుట్ర చేస్తున్నారని, దారి మళ్లించడం వల్ల అయ్యే రూ.12,500 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం అనుమతులకు విరుద్ధంగా ట్రిపుల్ఆర్ నిర్మించి ప్రజలపై భారం మోపితే బీఆర్ఎస్ ఊరుకోబోదని, ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.
ఇటీవల రెడ్డి హాస్టల్లో ఓ కార్యక్రమానికి వెళ్లిన మంత్రి వెంకట్‌రెడ్డి ఆర్బీవీబీఆర్కు ఏం చేశారో చెప్పాలని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్బీవీబీఆర్ సొసైటీకి ఏ సీఎం చేయని విధంగా కేసీఆర్ రూ.500 కోట్లు విలువైన 10 ఎకరాల భూమిని బుద్వేల్‌లో కేటాయించారని తెలిపారు. భవన సముదాయం కోసం రూ.10 కోట్లు సమకూర్చినట్టు చెప్పారు. రెడ్డి, ఇతర వర్గాల విద్యార్థులకు సేవ చేస్తున్న ఆర్బీవీబీఆర్ సొసైటీ అభివృద్ధికి కేసీఆర్ పాటుపడ్డారని గుర్తుచేశారు. నారాయణగూడలోని పాత రెడ్డి హాస్టల్ పక్కన ఖాళీగా ఉన్న రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని మహిళల హాస్టల్‌కు కేటాయించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. సీఎం, మంత్రులు ఇప్పటికైనా కేసీఆర్ చేసిన పనులను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు మాని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 13 నెలలు దాటుతున్నా ట్రిపుల్ఆర్ కోసం ఒక్క ఎకరం భూమి కూడా సేకరించలేదని వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. పనులకు కేంద్రం టెండర్లు పిలిస్తే తామేదో చేసినట్టు సీఎం, మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హాయాంలో డిపాజిట్ చేసిన రూ.100 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రాజెక్టును తామే చేపడుతున్నట్టు చెప్పుకోవడం కోమటిరెడ్డికి సిగ్గుచేటు అని విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి చెప్పినట్టు ఫిబ్రవరిలో పనులు చేపట్టకపోతే సీఎం, మంత్రుల అబద్ధాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు.