హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను ఉచితంగా అమలుచేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే మాట తప్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజీనామా చేయాలని పేర్కొన్నారు. లేకపోతే ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదని గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పడమే అలవాటుగా మార్చుకున్న రేవంత్ సర్కారు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకోవడానికి కుయుక్తులు పన్నుతున్నదని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజలపై భారం మోపకుండా కొంతకాలం అపగలిగామంటే గతంలో బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ప్రశాంత్‌రెడ్డి ఫైరయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చినప్పుడు నానా యాగీ చేసి, తామొస్తే ఉచితంగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజలపై సుమారు రూ.20 వేల కోట్ల భారం మోపుతున్నారని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్తో ఒకో ప్లాట్‌పై లక్ష రూపాయల చొప్పున వసూలుకు కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచించారని ఆరోపించారు. క్రమబద్ధీకరణ కోసం సుమారు 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయని ప్రభుత్వమే చెప్తున్నదని.. ఈ లెక్కన 25 లక్షల మందికి నష్టం జరుగుతదని స్పష్టం చేశారు.