మోర్తాడ్/వేల్పూర్, జూన్ 18: రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నాడు కేసీఆర్ పాలనలో రాజుల్లా ఉన్న రైతులను రోడ్లపైకి తీసుకొచ్చిన ఘనత రేవంత్‌రెడ్డిదని విమర్శించారు.
యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని, రైతులకు ఎకరానికి నాలుగు సంచుల యూరియాను ఒకేసారి పంపిణీ చేయాలని, సొసైటీల్లో, ఎరువుల దుకాణాల్లో సరిపడా యూరియా విరివిగా ఉంచాలనే డిమాండ్లతో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశానికి అన్నంపెట్టే రైతన్న నేడు కడుపు మంటతో, ఆవేదనతో రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన దుస్థితిని ఈ రాక్షస ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు.
మొన్నటి వరకు వడ్ల కొనుగోలు కోసం రోడ్డెక్కితే, ఇప్పుడు యూరియా కోసం ఆందోళనకు దిగాల్సిన దుస్థితిని నెలకొన్నదని అన్నారు. యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని, ఎకరానికి 4 సంచుల చొప్పున యూరియాను ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎరువులు పుష్కలంగా ఉన్నాయంటూ పాలకులు, అధికారులు చేస్తున్న ప్రకటనల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఎరువుల ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని మండిపడ్డారు. తక్షణమే యాప్‌ను రద్దు చేయడంతోపాటు పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.