హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బీటీంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. అందుకే ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్‌రెడ్డిని బీజేపీ కాపాడుతున్నదని, మంత్రుల ఇండ్లపై ఈడీ దాడులు చేసినా కేసుల నమోదులో తాత్సారం చేస్తున్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలికి వెళ్లిన హరీశ్‌రావు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారని, బీజేపీ నేతల పర్యటనకు మాత్రం అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పిచ్చి ప్రేలాపనలు పలికారని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టనిదే రేవంత్‌రెడ్డికి పూటగడవడం లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి గులాంగిరీ చేసే రేవంత్‌రెడ్డి.. తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను తిడితే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. ఆయనకు తగిన సమయంలో బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు దిగినా బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఇక్కడ ప్రమాదం జరిగితే, హరీశ్‌రావు దుబాయ్ వెళ్లి విందుల్లో మునిగితేలారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. హరీశ్‌రావు దుబాయ్‌కి వెళ్లాకే ఎస్ఎల్బీసీ ఘటన జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కూతురు వివాహ వేడుకకు హాజరైతే విందులు, వినోదాల్లో మునిగితేలారని అభాండాలు వేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దుబాయ్‌లో ఉన్న మంత్రి కోమటిరెడ్డి నింపాదిగా ఘటనాస్థలికి వెళ్లి హడావుడి చేశారని విమర్శించారు. అక్కడే చేపల కూర వండించుకొని తిన్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రమాద బాధితులకు అండగా నిలవాల్సిన సీఎం, మంత్రులు బీఆర్ఎస్పై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.