హైదరాబాద్: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్న మాజీ సర్పంచులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) ఖండించారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, రేవంత్ సర్కార్ ఉదయం 4 గంటలకే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో బందించడం హేమమైన చర్య అన్నారు. అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు చేసిన పనులకే డబ్బులు ఇవ్వమంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కోపమొచ్చిదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌కు మాజీ సర్పంచులంటే ఎందుకింత కోమని విమర్శించారు.
చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు డబ్బులు ఉండవు కానీ, బడా కాట్రాక్టులకు కమిషన్ల కోసం బిల్లులు చెల్లించేందుకు డబ్బులు ఉంటాయన్నారు. సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలకు ఇవ్వడానికి, రూ.లక్షన్నర కోట్లతో మూసీ ప్రాజెక్ట్ చేపట్టడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బు ఉందని మండిపడ్డారు. పది నెలలుగా అడుగుతున్నా బిల్లులు చెల్లించకుండా సర్పంచ్‌లను ప్రభుత్వం వేధిస్తున్నదని చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది, పారిశుద్ధ్యం పడకేసిందని విమర్శించారు. మాజీ సర్పంచ్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన మాజీ సర్పంచ్‌లను బేషరతుగా విడుదల చేయాలన్నారు.