హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘మా కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారు.. మా పొట్ట కొడితే ఇంట్లోని మహిళలకు కన్నీరే మిగులుతుంది’ అని తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఆటో కార్మికుల కుటుంబాలను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆటో కార్మికుల సమస్యలపై సదస్సు నిర్వహించనున్నట్టు సంఘం రాష్ట్ర నాయకుడు వేముల మారయ్య తెలిపారు. నాచారంలోని ఆటో యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఆ టో కార్మికుల కష్టాలు, డిమాండ్లపై కరపత్రం విడుదల చేశారు.
ఉచిత బస్సు ప్రయాణం తాత్కాలికంగా సరైనదే అనిపించినప్పటికీ.. దీర్ఘకాలికంగా ఆ పథకాన్ని అమలు చేయడం కష్టంగా మారుతుందని పేర్కొన్నారు. ఆ నష్టమంతా మళ్లీ ప్రజలపైనే పడుతుందని వివరించారు. ఆటోడ్రైవర్లు తమ వృత్తినే వదిలేసుకుని రోడ్డున పడాల్సిన దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పీ నారాయణ, ఎం విజయ్‌కుమార్, నిరంజన్, దయ్యాల దాసు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట, చెన్నారావుపేటలో ఆటోలతో భారీ ర్యా లీ తీసి, రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేల జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.