MLA Shankar | నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 7 : వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యపై వెలమ సంఘం నాయకులు భగ్గుమన్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పలుచోట్ల ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బాధ్యత గల పదవిలో ఉండి ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు.
అంతు చూస్తానని బెదిరించిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో వెలమలు స్థానిక ప్రెస్‌భవన్ నుంచి టూటౌన్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌లో వెలమ సంఘం సభ్యులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఫ్లెక్సీని దహనం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ తిరుమల్‌గౌడ్, తహసీల్దార్ కనకయ్యకు ఫిర్యాదు చేశారు. జమ్మికుంట పోలీసు స్టేషన్లో మున్సిపల్ చైర్మన్, వెలమ సంఘం అధ్యక్షుడు తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, సంఘం నాయకులు షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు ఇచ్చారు.
వెలమ అసోసియేషన్ ప్రతినిధులు నిజామాబాద్ రూరల్, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శంకరయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలని హైదరాబాద్‌లోని నల్లకుంటలో వెలమ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. సంఘం కోశాధికారి చెప్యాల హరీశ్‌రావు, మాజీ కార్యవర్గ సభ్యుడు వీ రవీందర్రావు, శ్రీశైలం వెలమ చౌల్ట్రి కమిటీ మెంబర్ గోనె ప్రదీప్‌రావు తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంటితోపాటు అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
వెలమల మనోభావాలను దెబ్బతీసిన ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా వెలమ సంఘం ఉపాధ్యక్షుడు తాండ్ర శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. శనివారం వెలమలు బతుకమ్మ పార్కు నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్ వ్యాఖ్యలపై కూకట్పల్లి వెలమ అసోసియేషన్ నేతలు భగ్గుమన్నారు.
ఎర్రబల్లి సతీశ్‌రావు, కంచనపల్లి నాగరాజు ఆధ్వర్యంలో వెలమ అసోసియేషన్ నేతలు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కే నవీన్‌కుమార్‌కు వినతిపత్రాలను అందజేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే శంకరయ్యపై స్పీకర్ చర్యలు తీసుకునేలా కృషి చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే శంకరయ్య దిష్టిబొమ్మను జాతీయ రహదారిపై దహనం చేశారు. వెలమ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ నుంచి హస్తినాపురం వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి ఎమ్మెల్యే శంకరయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు.
వెలమలను దూషించారన్న వివాదంపై షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య స్పందించారు. తన మాట లు వెలమజాతికి సం బంధించినవిగా భావిస్తే ఉపసంహరించుకుంటున్నానని పేర్కొన్నారు. శనివారం ఆయన షాద్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను మాట్లాడిన మాటలను కత్తిరించి వివాదాస్పదంగా మార్చి కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.