Medigadda | వరంగల్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందనే విమర్శలొస్తు న్నాయి. కుంగుబాటుకు గురైన పిల్లర్లు కొట్టుకుపోవాలని చూస్తున్న ప్రభుత్వం కల నెరవేరడం లేదని, దీంతో మరో ప్లాన్ రెడీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిల్లర్ల కుంగుబాటు సాకుతో బరాజ్ పైనుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం ఉన్నట్టుండి అక్కడి సెక్యూరిటీని ఎత్తివేసింది. ఫలితంగా బరాజ్ పైనుంచి వాహన రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వాహన రాకపోకలతో కుంగిన పిల్లర్లపై ఒత్తిడి పడి అవి కొట్టుకుపోవాలన్న కుట్ర ఇందులో దాగి ఉన్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండ లం అంబటిపల్లి మీదుగా మేడిగడ్డ బరాజ్‌పై నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. బరాజ్ మీది నుంచి కొత్తపల్లి, నదికుడ, వడిదం, రంగాజామ్పేట, అసరెల్లి, అంకిసా, మొట్లటెకడ తదితర గ్రామాల ప్రయాణికులు బరాజ్ పైనుంచి ప్రయాణిస్తున్నారు. డీసీఎంలు, ట్రాక్టర్లు పొద్దంతా భారీ లోడ్లతో పయనిస్తున్నాయి. మొన్నటిదాకా మేడిగడ్డ బరాజ్‌పై రాకపోకలు నిలిచిపోవడంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు వెళ్లే వాహనాలు కాళేశ్వరం వంతెన మీది నుంచి వెళ్లేవి. మేడిగడ్డ బరాజ్‌కు ఇరువైపులా సెక్యూరిటీని తొలగించి, చెక్‌పోస్ట్ ఎత్తివేయడంతో వాహనదారుల ప్రయాణానికి బ్రేక్ల్లేకుండా పోయింది.
రికార్డుస్థాయిలో వరద తట్టుకుని..
నాలుగు దశాబ్దాల కాలంలో గోదావరి నదికి ఎన్నడూలేని విధంగా 2022లో వచ్చిన 29 లక్షల క్యూసెక్కుల వరదను మేడిగడ్డ తట్టుకున్నది. 2023లో 15 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకొని నిటారుగా నిలబడింది. ఈ సీజన్లో మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వానలకు ప్రతి రోజూ వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. మంగళవారం 1,18,850 క్యూసెక్కుల నీరు వచ్చింది. 2023 అక్టోబర్‌లో పిల్లర్లు కుంగిన తర్వాత బరాజ్‌కు ఉన్న 85 గేట్లను ఎత్తివేసి దిగువకు వదులుతున్నారు. లక్షల క్యూసెక్కుల రికార్డు స్థాయి వరద ప్రవాహ ఉధృతిని తట్టుకున్న మేడిగడ్డ బరాజ్‌ను ‘పైనుంచి కూలగొట్టాలె’ అనే కుట్రలో భాగంగానే ఇప్పుడు బరాజ్‌కు ఉన్న రక్షణను ఎత్తివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బరాజ్‌లోని 8 బ్లాక్‌ల్లో 85 గేట్లున్నాయి. ఇందులో ఏడో బ్ల్లాక్లోని 20వ పిల్లర్ కుంగింది. ఎండాకాలంలో మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నా, ఎన్డీఎస్ఏ సహా నిపుణులు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం ‘కమిషన్ నివేదికను బూచిగా చూపి’ ఇంతకాలం పట్టించుకోలేదు. ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పెద్ద ఎత్తున వస్తున్నది. దీనికితోడు బరాజ్ పైనుంచి వాహనాల ఒత్తిడి పెరిగితే బరాజ్ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
నిర్మాణ సమయంలోనే కట్టుదిట్టమైన భద్రత
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక బరాజ్‌పై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలపై నిఘా కొనసాగించారు. అయితే, బరాజ్ కుంగుబాటుకు గురైన తర్వాతి నుంచి బరాజ్‌పై రాకపోకలను నిలిపివేశారు. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి బరాజ్‌పై చెక్‌పోస్టును ఎత్తివేశారు. సెక్యూరిటీని తొలగించారు. సెక్యూరిటీ ఎత్తివేతపై ఇరిగేషన్ అధికారులను ఆరా తీస్తే ‘అవునా, ఆ విషయం మాకు తెలియదు. బరాజ్ వద్ద సెక్యూరిటీ లేని సంగతి మా దృష్టికే రాలేదు’ అని దాటవేయటం గమనార్హం.
అనుమానాల కోణంలో విచారణ ఏదీ?
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు విషయంలో మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అక్టోబర్‌లో పెద్ద శబ్దం వచ్చిందని, ఆ పేలుడుకు కారణాలను అన్వేషించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎన్నికల వాతావరణం నెలకొన్న సమయంలో పేలుడు జరిగింది. కుంగుబాటు వెనక కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఆ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టే వృథా అన్నట్టుగా కాంగ్రెస్ ప్రచారం చేసి లబ్ధిపొందింది. ఇప్పుడేమో ఉన్న సెక్యూరిటీని ఎత్తివేసి రాకపోకలకు అవకాశం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటనే వాదన వినిపిస్తున్నది. కనీస మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం వెనక భారీ కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీకి గోదావరి నీళ్లు
మేడిగడ్డ బరాజ్‌లోని రెండు పిల్లర్లు కుంగినప్పటి నుంచి దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి పరుగులు పెడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి కుంగుబాటు దాకా తెలంగాణలోని 20,33,572 ఎకరాల్లో పంటసిరులు కురిపించింది. కుంగుబాటు తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్టు సాకుతో కొంతకాలం రిపేర్లను పక్కనపెట్టింది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో తాత్సారం చేస్తూ వస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పట్లో బీఆర్ఎస్ హెచ్చరికలతో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ఆన్‌చేసి రైతులకు నీళ్లిచ్చిన ప్రభుత్వం.. మేడిగడ్డ విషయంలో మాత్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నది. మేడిగడ్డ నుంచి దిగువకు లక్షల క్యూసెక్కులుగా గోదారి తరలివెళుతున్నది. తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టి ఆంధ్రప్రదేశ్ రైతులకు పసిడి సిరులు పండించే కుట్రలో భాగంగానే మేడిగడ్డ బరాజ్‌ను గాలికి వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ద్విముఖ కుట్రల్లో భాగమా?
మేడిగడ్డ బరాజ్ మీద ఇంతకాలం ఉన్న రక్షణల తొలగింపు, యథేచ్ఛగా రాకపోకల కొనసాగింపు వెనుక కాంగ్రెస్ ముఖ్యుల ద్విముఖ కుట్ర దాగి ఉన్నదని రాజకీయ, సాగునీటి రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. మేడిగడ్డ బరాజ్, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధక ప్రాజెక్టుగా చూపి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్న కుట్ర ఇందులో దాగి ఉన్నదని చెప్తున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ప్రత్యేకించి ఆ రాష్ట్ర రైతులకు గోదావరి నీటిని బహుమానంగా ఇవ్వాలన్నది రెండో ఎత్తుగడలో భాగంగా కనిపిస్తున్నదని కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న నీటిపారుదల, రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి మంగళవారం దాకా 8 రోజుల్లోనే 5,42,560 కూసెక్కుల నీరు మేడిగడ్డ నుంచి దిగువకు వెళ్లిపోయింది. వచ్చిన వరద వచ్చినట్టు మేడిగడ్డలోని 85 గేట్ల ద్వారా వెళ్లిపోతున్నది.
పోలవరంలో గోదావరి పరవళ్లు
‘ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి పెద్ద ఎత్తున వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. పోలవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. గోదావరి నీటిమట్టం గడచిన మూడు రోజుల్లో అనూహ్యంగా పెరిగింది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి అదనంగా వస్తున్న 1,68,729 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేశాం’
– గత శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులశాఖ
మేడిగడ్డ
రివర్ స్లూయిస్