ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 02:59:30

డ్యామేజీకి ఇన్సూరెన్స్‌ ఉందా లేదా?

డ్యామేజీకి ఇన్సూరెన్స్‌ ఉందా లేదా?

  • భారీ వర్షాలతో నీట మునిగిన వాహనాలు
  • కవరేజీ కోసం ప్రయత్నిస్తున్న యజమానులు
  • ప్లాన్‌ను సరిచూసుకున్నాకే దరఖాస్తు: సంస్థలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కురిసింది చిన్నవాన కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వరదలు నదుల్లా పొంగాయి. రోడ్డు మీదున్న కార్లు, లారీలు, బస్సులు కూడా కొట్టుకెళ్లిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోనైతే వాహనాలు కనిపించకుండా మునిగిపోయాయి. కొన్ని వాహనాలు చిన్న రిపేర్లతో బయటపడితే, మరికొన్ని వాహనాలకు మాత్రం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దీంతో యజమానులు ఇన్సూరెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని, ఎంత వరకు కవరేజీ ఉన్నదో చూసుకున్నాకే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘వాహనాల ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. వరద పూర్తిగా తగ్గిపోయి, అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పూర్తైతే దరఖాస్తుల సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది’ అని బజాజ్‌ అలియాంజ్‌ ఇన్సూరెన్స్‌ మోటర్‌ ఓడీ క్లెయిమ్స్‌ హెడ్‌ పద్మనాభ చెప్పారు. ఇంజిన్‌కు సైతం రక్షణ కల్పించే పాలసీని కట్టినవారికి మాత్రమే ఊరట కలుగుతుందని ఆయన చెప్పారు. ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ లేకున్నా, ఇతర థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌లు ఉన్నా జేబుకు చిల్లు ఖాయమన్నారు. కొందరు పాలసీలతోపాటు ఇంజిన్‌ ప్రొటెక్టర్‌, జీరో డిప్రిసియేషన్‌ కవర్‌, కన్జ్యూమరబుల్స్‌ కవర్‌ వంటి యాడ్‌ ఆన్‌ కవర్‌ పాలసీలు తీసుకుంటారని, వారికి పూర్తిస్థాయిలో కవరేజీ లభించే అవకాశం ఉన్నదన్నారు. 

మూడు క్యాటగిరీలు

ఆర్‌కేఎస్‌ మోటార్స్‌ సీఎండీ విన్యారామ్‌దయాల్‌ సాబూ ప్రకారం రిపేర్లను బట్టి వాహనాలను మైనర్‌, మేజర్‌, హైరిస్క్‌ అని మూడు విభాగాలుగా వర్గీకరిస్తున్నారు. 

కార్పెట్‌ లెవల్‌ వరకు మాత్రమే కార్లు మునిగితే మైనర్‌గా పేర్కొన్నారు. శుభ్రం చేయటం, విడిభాగాలన్నింటినీ ఒకసారి చెక్‌ చేయటం వంటివి మాత్రమే అవసరం అవుతాయి. ఇందుకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చవుతుంది.

నీళ్లు డ్యాష్‌బోర్డు వరకు వస్తే మేజర్‌గా చెప్తారు. చాలా రిపేర్లు అవసరం అవుతా యి. కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలను మార్చాల్సి వస్తుంది. రూ.40వేలు-50వేలు వరకు వ్యయం అవుతుందని అంచనా. 

కారు నీళ్లలో పూర్తిగా మునిగిపోయి ఎక్కువకాలం పాటు ఉండిపోతే హైరిస్క్‌ క్యాటగిరీ కింద భావిస్తారు. ఇందులో ఎలక్ట్రానిక్‌ పరికరాలను మార్చటంతోపాటు ఇంజిన్‌లోని పలు విడిభాగాలు, ఇంటిరీయర్‌లోని సీట్లు వంటివి మార్చాల్సి వస్తుంది. ఇందుకు రూ.1.2 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు జేబుకు చిల్లు పడుతుందని చెప్తున్నారు.

అన్ని వివరాలు తెలుసుకున్నాకే పాలసీ కొనాలి

ఇవి అంచనాలు మాత్రమేనని, కారు కంపెనీ, మోడల్‌ను బట్టి ధరలు మారుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. డీజిల్‌ ఇంజిన్‌తో పోల్చితే పెట్రోల్‌ ఇంజిన్‌కు వ్యయం తక్కువ అవుతుందన్నారు. మనం తీసుకున్న పాలసీ.. వాహనంలోని అన్ని భాగాలను కవర్‌ చేస్తుందా? యాక్సిడెంట్లకు మాత్రమే పనిచేస్తుందా? లేదా ఇలాంటి విపత్తుల సమయంలోనూ కవర్‌ చేస్తుందా? వంటి అంశాలను చూసుకొని క్లెయిమ్‌ చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటి నుంచైనా పాలసీలు కొనేవాళ్లు అన్ని వివరాలు తెలుసుకొని తీసుకోవాలని సూచిస్తున్నారు. ‘కొందరు పాలసీలు అమ్మేందుకు బంపర్‌ టు బంపర్‌, ప్లాటినం, గోల్డ్‌, సిల్వర్‌ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అయితే, వాటి పేర్లను కాకుండా, ఏయే రిపేర్లకు కవరేజీ వస్తుందో చూసి కొనుగోలు చేయాలి’ అని పేర్కొన్నారు.


logo