హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం 20 ఏండ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యూవల్ చార్జీలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల వల్ల పాత వాహనాలను ఉపయోగించుకోవాలని అనుకునే వారికి భారీగా ఖర్చు కానుంది. ఇప్పటికే 15-20 ఏండ్ల వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు అమల్లో ఉన్న నిబంధనలతోపాటు, 20 ఏండ్లకు పైబడిన వాహనాల కోసం కొత్త రుసుములు విధిస్తూ..
మోటార్ వాహన చట్టంలో సవరణలను కేంద్రం ప్రకటించింది. 20 ఏండ్లు పైబడిన బైక్‌లకు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజు రూ.2000కు, త్రీవీలర్ వాహనాలు ఫీజు రూ.5000కు, కార్లు, జీపుల రెన్యూవల్ ఫీజు రూ.10వేలకు పెరిగింది. దిగుమతి చేసుకున్న టూవీలర్, త్రీవీలర్ వాహనాల ఫీజు రూ.20వేలకు, కార్లు, ఇతర భారీ వాహనాల ఫీజులు ఏకంగా రూ.80వేలకు పెరిగింది.